
టీమిండియా స్పీడ్ గన్ జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు నెలకొల్పాడు. విదేశాల్లో వేగంగా 100 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అగ్ర స్థానంలో నిలిచాడు. ఇప్పటివరకు కెరీర్‌లో 25 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన బుమ్రా 105 వికెట్లు తీశాడు. ఇందులో విదేశాల్లోనే బుమ్రా 23 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. 101 వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. సౌతాఫ్రికాతో జరగుతున్న తొలి టెస్టు నాలుగో రోజు ఆటలో బుమ్రా ఈ రికార్డును అందుకున్నాడు. సఫారి బ్యాటర్ వాన్ డర్సెన్ను ఔట్ చేయడం ద్వారా బుమ్రా ఖాతాలో ఈ రికార్డు చేరింది. భారత జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న బుమ్రాపై సౌతాఫ్రికా గడ్డపై టెస్ట్ సిరీస్‌లో భారీ అంచాలు ఉన్నాయి. సఫారీ గడ్డపై టీమిండియా సిరీస్ గెలవాలంటే బుమ్రా రాణించడం ఎంతో కీలకం దానికి తగ్గట్టే ఇప్పటివరకు జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో బుమ్రా రాణిస్తున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు తీశాడు. అయితే తొలి ఇన్నింగ్స్‌లో ఒక వికెట్ తీశాక బుమ్రా గాయపడ్డాడు. గ్రౌండ్ వీడాడు. దీంతో టీంతోపాటు అభిమానుల్లోనూ తీవ్ర ఆందోళన నెలకొంది. దానికి తగ్గట్టే ఆ రోజు బుమ్రా గాయం విషయంపై బీసీసీఐ ఎటువంటి ప్రకటన చేయలేదు. దీంతో బుమ్రా ఆడతాడా లేదా అని అందరిలో సందేహం నెలకొంది. కానీ ఆ తర్వాతి రోజు మళ్లీ గ్రౌండ్‌లోకి వచ్చి బుమ్రా బౌలింగ్ చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బౌలింగ్ చేయడమే కాకుండా మరో వికెట్ కూడా పడగొట్టాడు.
ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్‌లో 305 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికాను ఇబ్బందుల్లోకి నెట్టడంలో బుమ్రా కీలక పాత్రం పోషించాడు. ఇప్పటికే సౌతాఫ్రికా కోల్పోయిన 4 వికెట్లలో బుమ్రానే రెండు కీలక వికెట్లను తీశాడు. నేడు మ్యాచ్ సజావుగా సాగితే బుమ్రా మరిన్ని వికెట్లను తన ఖాతాలో వేసుకునే అవకాశం ఉంది. కాగా కెరీర్‌లో ఇప్పటివరకు 25 టెస్టు మ్యాచ్‌లతోపాటు 67 వన్డే మ్యాచ్‌లు కూడా ఆడిన బుమ్రా ఏకంగా 108 వికెట్లు పడగొట్టాడు. ఇక 55 టీ20 మ్యాచ్‌ల్లో 66 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్‌లో 106 మ్యాచ్‌లు ఆడి 130 వికెట్లు పడగొట్టాడు. 2016లో టీమిండియాలోకి అడుగుపెట్టిన బుమ్రా ఆరేళ్లుగా జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు.