వైజాగ్‌లో రెండో వన్డే.. బౌలింగ్ చేయనున్న బుమ్రా?!!

హైదరాబాద్: బుధవారం రాత్రి వాంఖెడేలో జరిగిన చివరి టీ20లో భారత్ 67 పరుగుల తేడాతో వెస్టిండీస్‌పై ఘన విజయం సాధించింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 2-1తో కైవసం చేసుకుంది. టీ20 సిరీస్‌ను ఖాతాలో వేసుకున్న టీమిండియా.. వన్డే సిరీస్‌కు సన్నద్ధమవుతోంది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య ఈనెల 15న తొలి వన్డే మ్యాచ్ చెన్నైలో జరగనుంది. ఈ మ్యాచ్ కోసం కోహ్లీసేన గురువారం చెన్నై చేరుకుంది.

బౌలింగ్ చేయనున్న బుమ్రా:
18న విశాఖపట్నంలో రెండో వన్డే జరగనుంది. ఈ వన్డేకు ముందు జరిగే ప్రాక్టీస్ సెషన్‌లో టీమిండియా పేస్ సెన్సేషన్ జస్‌ప్రీత్ బుమ్రా పాల్గొననున్నాడు. వెన్నునొప్పి గాయం నుంచి పూర్తిగా కోలుకోవడంతో.. బుమ్రా వైజాగ్ నెట్స్‌లో ప్రత్యేక అతిథిగా సందడి చేయనున్నాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మలకు బుమ్రా నెట్స్‌లో బౌలింగ్ చేస్తాడని ఓ జాతీయ వార్తా పత్రిక కథనం ప్రచురించింది. బుమ్రా ఫిట్‌నెస్‌ను పరీక్షించేందుకు నెట్స్‌లో బౌలింగ్ చేయించనున్నారని బీసీసీఐ వర్గాల నుండి సమాచారం తెలిసింది.

బుమ్రా వర్కౌట్లు:
బుమ్రా వెన్ను భాగంలోని ఎముక కొద్దిగా చిట్లినట్లు వైద్య పరీక్షల్లో తేలింది. వెంటనే బీసీసీఐ అతడికి మెరుగైన చికిత్స కోసం ఏర్పాట్లు చేసింది. దీంతో స్వదేశంలో దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, వెస్టిండీస్ సిరీస్‌లకు దూరమయ్యాడు. వచ్చే జనవరిలో జరిగే న్యూజిలాండ్ సిరీస్‌కు బుమ్రా అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ ట్రైనర్ రజనీకాంత్ శివజ్ఞానమ్‌తో కలిసి ముంబై క్రికెట్ అసోసియేషన్‌లో వర్కౌట్లు చేస్తున్న విషయం తెలిసిందే.

విజయవంతమైన బౌలర్లలో ఒకడు:
టీమిండియా అత్యంత విజయవంతమైన బౌలర్లలో బుమ్రా ఒకడు. అంతేకాదు వన్డేల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు తీసిన రెండో భారత బౌలర్‌గా బుమ్రా పేరిట అరుదైన రికార్డు ఉంది. టీమిండియా తరుపున ఇప్పటివరకు 12 టెస్టుల్లో 62 వికెట్లు, 58 వన్డేల్లో 103, 42 టీ20ల్లో 51 వికెట్లు పడగొట్టాడు.

చెన్నైలో తొలి వన్డే:
విండీస్ వన్డే సిరీస్ కోసం బుధవారం బీసీసీఐ సెలెక్టర్లు 15 మందితో కూడిన జట్టును ప్రకటించారు. ఓపెనర్ శిఖర్ ధావన్ స్థానంలో టెస్టు ఓపెనర్ మయాంక్ అగర్వాల్ చోటు దక్కించుకున్నాడు. తొలి వన్డే ఈనెల 15న చెన్నైలో.. రెండో వన్డే 18న విశాఖపట్నంలో.. మూడో వన్డే 22న కటక్‌లో జరుగుతాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications