Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐసీసీ 'ప్లేయర్​ ఆఫ్​ ది మంత్​' రేసులో జస్ప్రీత్ బుమ్రా.. పోటీలో జో రూట్‌!!

Jasprit Bumrah, Joe Root nominated for ICC mens Player of the August Month award

దుబాయ్‌: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మెన్స్‌ 'ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌' అవార్డు రేసులో టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఆగస్టు నెలకు గాను నామినేట్ అయ్యాడు. బుమ్రాతో పాటు పాకిస్థాన్ పేసర్ షాహిన్ అఫ్రిది, ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ కూడా పోటీపడుతున్నారు. మహిళల క్రికెట్​లో ఐర్లాండ్​కు చెందిన క్రికెటర్లు గాబీ లూయిస్​, ఈమియర్​ రిచర్డ్​సన్​తో పాటు థాయ్​లాండ్​కు చెందిన నట్టాయా బూచాతమ్​​ పేర్లను పరిగణలోకి తీసుకుంది ఐసీసీ. ప్రపంచవ్యాప్తంగా మెరుగైన ప్రదర్శన చేసే ఆటగాళ్లను గుర్తించి ప్రతి నెల వారికి అవార్డులను ఇచ్చే కార్యక్రమాన్ని ఐసీసీ ఈ ఏడాది జనవరి నుంచి ప్రారంభించింది. అందులో భాగంగానే ఆగస్టు నెల కోసం టాప్ ఆటగాళ్ల పేర్లను వెల్లడించింది.

ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో 9 వికెట్లు పడగొట్టిన జస్ప్రీత్ బుమ్రా.. లార్డ్స్‌లో జరిగిన రెండో టెస్టులో బ్యాటింగ్‌లోనూ అద్భుతంగా రాణించాడు. మహ్మద్ షమీతో కలిసి 9వ వికెట్‌కు 89 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించాడు. ఈ టెస్టులో భారత్ ఘన విజయాన్ని అందుకుంది. మూడో టెస్టులో బుమ్రా జోరు తగ్గినా.. నాలుగో టెస్టులో పుంజుకున్నాడు. ఇప్పటికే 4 వికెట్లు పడగొట్టాడు. అంతేకాదు 100 టెస్టు వికెట్లు తీసిన భారత బౌలర్లలో 8వ స్థానంలో నిలిచాడు. బుమ్రా 24వ మ్యాచ్‌లో ఈ రికార్డును చేరుకున్నాడు. కపిల్ దేవ్ (25) పేరిట ఉన్న రికార్డును అధిగమించి వంద టెస్టు వికెట్లు సాధించిన అత్యంత వేగవంతమైన భారత పేసర్‌గా నిలిచాడు.

ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జో రూట్ టీమిండియాతో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌లో చెలరేగి ఆడుతున్నాడు. వరుస సెంచరీలతో దూకుడుమీదున్న రూట్‌ ఇటీవలే టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాడు. భారత్‌తో జరిగిన తొలి మూడు టెస్టుల్లోనూ సెంచరీలు బాదిన రూట్‌.. 105.81 సగటుతో 528 పరుగులు సాధించాడు. ఇక వెస్టిండీస్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో షాహిన్‌ ఆఫ్రిది బౌలింగ్‌లో చెలరేగాడు. ఆ సిరీస్‌లో మొత్తంగా 18 వికెట్లు పడగొట్టిన షహీన్.. రెండో టెస్టులో ఏకంగా 10 వికెట్లు పడగొట్టాడు. షాహిన్‌ అఫ్రిది రాణింపుతో పాక్‌ ఈ టెస్టులో విజయం సాధించి సిరీస్‌ను సమం చేసింది.

ఇక ఐసీసీ వుమెన్స్‌ 'ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌' అవార్డుకు ముగ్గరు మహిళా క్రికెటర్లు ఎంపిక కాగా.. ఇద్దరు ఐర్లాండ్‌కే చెందినవారు ఉండడం విశేషం. మరొకరు థాయ్‌లాండ్‌కు చెందిన ప్లేయర్ ఉంది. గాబీ లూయిస్‌, ఈమియర్‌ రిచర్డ్‌సన్‌, నట్టాయా బూచాతమ్‌లు ఈ అవార్డుకు నామినేట్‌ అయ్యారు. కాగా గాబీ లూయిస్‌ టీ20 క్రికెట్‌లో సెంచరీ చేసిన తొలి ఐరీష్‌ క్రికెటర్‌గా నిలవగా.. రిచర్డ్‌సన్‌ ఐసీసీ టీ20 వుమెన్స్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీలో జర్మనీతో జరిగిన మ్యాచ్‌లో ఏడు వికెట్లు తీసి టీ20 చరిత్రలో రికార్డు సృష్టించింది. ఇక థాయ్‌లాండ్‌ మహిళా క్రికెటర్‌ నట్టాయా బూచాతమ్‌ జింబాబ్వేపై సిరీస్‌ గెలవడంలో కీలకపాత్ర పోషించింది.

మూడు ఫార్మాట్లలోని ప్రతీ కేటగిరీకి ముగ్గురు నామినీలను ఆన్-ఫీల్డ్ పనితీరు, ఆ నెల రోజుల కాలంలో కనబర్చిన అద్భుత ప్రదర్శన ఆధారంగా ఐసీసీ అవార్డు నామినేటింగ్ కమిటీ నిర్ణయిస్తుంది. ఇది ప్రతి నెల మొదటి రోజున జరుగుతుంది. ఒకటో తేదీ నుంచి చివరి తేదీ వరకు చూపిన ప్రతిభ, పనితీరును రికార్డ్ చేస్తుంది. షార్ట్‌ లిస్ట్‌లో ఉన్న ఆటగాళ్లను స్వతంత్ర ఐసీసీ ఓటింగ్ అకాడమీతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఓటింగ్ ద్వారా విజేతను ఎంపిక చేస్తారు. ఐసీసీ ఓటింగ్ అకాడమీలో మాజీ క్రికెటర్లతో పాటు సీనియర్ జర్నలిస్ట్‌లు, బ్రాడ్ కాస్టర్స్, ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌కు సంబంధించిన సభ్యులు ఉంటారు.

Story first published: Monday, September 6, 2021, 21:01 [IST]
Other articles published on Sep 6, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+