హైదరాబాద్: ట్రాఫిక్ అవగాహన కోసం జైపూర్ ట్రాఫిక్ పోలీసు శాఖ తన చిత్రాన్ని వాడుకోవడంపై టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా అసహనం వ్కక్తం చేశాడు. తన ఫోటోకి బదులు మరో ఫోటోని వాడుకుని ఉంటే బాగుండేదని అతడు సూచించాడు. వివరాల్లోకి వెళితే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వేసిన నో బాల్ వేసిన చిత్రాన్ని జైపూర్ ట్రాఫిక్ పోలీసు శాఖ ప్రచార చిత్రంలో భాగంగా ఉపయోగించింది.
ఈ సందర్భాన్ని వాడుకొని ప్రజల్లో ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన పెంచాలని కర్ణాటక కేడర్‌కు చెందిన పోలీస్ ఆఫీసర్ సంజయ్ అగర్వాల్ భావించారు. బుమ్రా నోబాల్ వేసిన ఫొటోను ఆయన వాడుకున్నారు. 'గీత దాటొద్దు.. అందుకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి రావొచ్చు' అన్న సందేశం ఈ ఫొటో ద్వారా ప్రజలకు ఇచ్చారు.

బూమ్రా వేసిన నోబాల్ ఏకంగా మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసిన విషయం తెలిసిందే. తీవ్ర ఒత్తిడిలో బ్యాటింగ్‌కు దిగిన పాక్‌ను ఒత్తిడిలోకి నెట్టే సువర్ణావకాశం ఆరంభంలోనే చేజారింది. పాక్ ఓపెనర్ ఫఖర్ జమాన్ మూడు పరుగుల వద్ద ఉండగా బుమ్రా బౌలింగ్‌లో అతడిచ్చిన క్యాచ్‌ను కీపర్ ధోనీ ఒడిసి పట్టినా అది నోబాల్ కావడంతో జమాన్‌కు లైఫ్ లభించింది.
3 పరుగుల వద్ద తనకు అందివచ్చిన లైఫ్‌ని సద్వినియోగం చేసుకున్న ఫకార్ జమాన్ ఆ తర్వాత భారత బౌలర్లను చీల్చి చెండాడు. 114 పరుగులతో సెంచరీ చేశాడు. వన్డేల్లో తన తొలి సెంచరీని నమోదు చేసి పాకిస్థాన్‌ను పటిష్ట స్థితిలో నిలిపిన సంగతి తెలిసిందే.
'చాలా బాగా చేశారు. దేశం కోసం అత్యుత్తమంగా పోరాడితే మీరిచ్చే గౌరవమేంటో తెలుస్తోంది. పనిలో మీరు చేసే పొరపాట్లను మీలా నేనేం అపహాస్యం చేయను.. ఆందోళన చెందకండి' అని జైపూర్ ట్రాఫిక్ పోలీసు శాఖకు బుమ్రా ట్వీట్ చేశాడు.
అయితే తమ ప్రవర్తనతో పేసర్ బుమ్రా నొచ్చుకున్నాడని తెలుసుకున్న జైపూర్ ట్రాఫిక్ పోలీసు శాఖ ఈ ఫోటోపై క్షమాపణలు సైతం తెలియజేసింది. 'డియర్ బుమ్రా, నిన్ను బాధించాలని మా ఉద్దేశం కాదు. నీ సెంటిమెంట్లను, లక్షలాది క్రికెట్ అభిమానుల సెంటిమెంట్లను దెబ్బ తీయాలన్న ఉద్దేశంతో మేము అలా చేయలేదు' అని ట్విట్టర్ వేదికగా వివరణ ఇచ్చింది. అంతేకాదు బుమ్రాని యూత్ ఐకాన్‌గా అభివర్ణించిన జైపూర్ పోలీసు శాఖ మా అందరికీ నువ్వు ఆదర్శమని వరుస ట్వీట్లలో పేర్కొంది.