కోల్‌కతా: జస్ప్రీత్ బూమ్రా భారత్ జట్టుకు దొరికిన మంచి బౌలర్ అని ఆస్ట్రేలియా జట్టు ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ కితాబిచ్చాడు. టెస్టుల్లో, వన్డేల్లో ఎలా ఉన్నా ట్వంటీ 20ల్లో మాత్రం భారత జట్టు సత్తా ఉన్న జట్టు అని అతను చెప్పాడు.
ట్వంటి 20 ప్రపంచ కప్‌కు సమయం ఆసన్నమవుతున్న క్రమంలో ఇటీవల తమ దేశంలో పర్యటించిన భారత జట్టు ప్రదర్శనకు ఆస్ట్రేలియా జట్టు (ట్వంటీ 20లో) బెంబేలెత్తిపోయింది. వరుసగా నాలుగు వన్డేల్లో గెలిచిన ఆసిస్ జట్టు ఆ తర్వాత ట్వంటీ 20ల్లో చతికిలబడింది.

ఐదు వన్డేల సిరీస్‌లో చివరి వన్డేలో జూలు విదిల్చిన ధోనీ సేన ఆ తర్వాత జరిగిన మూడు టీ20ల్లో ఆసీస్‌ను వైట్ వాష్ చేసింది. చివరి టీ20లో ఆసీస్ కెప్టెన్‌గా బరిలోకి దిగిన వాట్సన్ ఏకంగా శతకం బాదినా ఆ జట్టుకు టీమిండియా చేతిలో పరాభవం తప్పలేదు.
ఈ నేపథ్యంలో గురువారం షేన్ వాట్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ట్వంటీ 20ల్లో భారత్‌ను ఓడించడం కష్టమేనని చెప్పాడు. రానున్న ట్వంటీ 20 ప్రపంచ కప్ ఫేవరెట్ భారత జట్టు అని చెప్పాడు.