
హైదరాబాద్: భారీ అంచనాల మధ్య దక్షిణాఫ్రికాలో అడుగుపెట్టిన భారత జట్టు కేప్‌టౌన్ వేదికగా జరగనున్న తొలి టెస్టులో దారుణంగా ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ టెస్టులో టీమిండియా 72 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. కేప్‌టౌన్ టెస్టుతో అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేసిన జస్ప్రీత్ బుమ్రా తన తొలి వికెట్‌గా ఏబీ డివిలియర్స్ వికెట్ తీయడం ఎంతో సంతోషంగా ఉందని అన్నాడు.
మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య శనివారం (జనవరి 13) నుంచి సెంచూరియన్ వేదికగా రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. కేప్‌టౌన్ టెస్టు ఓటమి వల్ల మా ఆత్మవిశ్వాసం ఏమాత్రం దెబ్బతినలేదని, ఆ టెస్టులో చేసిన తప్పులను సవరించుకుని రెండో టెస్టు ఆడతామని అన్నాడు.
రెండో టెస్టు నేపథ్యంలో బుమ్రా శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ 'కేప్‌టౌన్ టెస్టు నుంచి చాలా నేర్చుకున్నాను. బౌలర్‌గా నేను వీలైనంత త్వరగా వికెట్ తీయాలని అనుకుంటాను. నేను అనుకున్నట్లు త్వరగానే డివిలియర్స్ వికెట్ దక్కింది. చాలా సంతోషంగా ఉంది. మ్యాచ్ గెలిస్తే ఆనందంగా.. ఓడిపోతే నిరాశగా ఉండటం నాకు తెలియదు' అని అన్నాడు.
'ఒక మ్యాచ్ అనంతరం మాలో ఏమాత్రం ఆత్మవిశ్వాసం తగ్గదు. అదే జరిగితే తదుపరి మ్యాచ్ సరిగా ఆడలేం. నా వరకు కేప్‌టౌన్ టెస్టు మంచి అనుభవం. ఎందుకంటే నేను దక్షిణాఫ్రికాలో ఇప్పటి వరకు ఆడలేదు. కేప్‌టౌన్‌లో ఆడటమే తొలిసారి. ఈ టెస్టు నుంచి చాలా నేర్చకున్నాను. ఇప్పుడు మా దృష్టి అంతా రెండో టెస్టుపైనే' అని బుమ్రా తెలిపాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.