వచ్చే నెలలో ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీలో బుమ్రా ఆడతాడా? లేదా? అనే విషయం ప్రస్తుతం క్రికెట్ ప్రియుల్లో ఉత్కంఠ రేపుతోంది. అయితే తాజాగా ఈ విషయంపై భారత క్రికెట్ అభిమానులకు సంతోషం కలిగించే వార్త బయటకు వచ్చింది. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం బుమ్రాను తీసుకునేందుకు బీసీసీఐ ఓ షరతు పెట్టిందట. అదేంటంటే
రీసెంట్ గా ముగిసిన ఆస్ట్రేలియా పర్యటనలో అదిరే ప్రదర్శన చేసిన బుమ్రా 32 వికెట్లతో టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును కూడా దక్కించుకున్నాడు. కానీ, సిడ్నీ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో వెన్ను నొప్పి కారణంగా బౌలింగ్ చేయలేదు. దీంతో మరో సారి భారత క్రికెట్‌లో జస్‌ప్రీత్ బుమ్రా ఫిట్‌నెస్‌పై తీవ్ర చర్చ సాగడం మొదలైంది.

ఇప్పటికే బుమ్రా.. బీసీసీఐ మెడికల్ టీమ్ తో కలిసి స్కానింగ్‌కు కూడా వెళ్లొచ్చాడు. కానీ, అతడి గాయం తీవ్రతపై బీసీసీఐ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే ఇంగ్లాండ్ తో టీ20, వన్డే సిరీస్‌లకు బుమ్రా విశ్రాంతి తీసుకుంటాడని, అతడిని కేవలం ఛాంపియన్స్ ట్రోఫీ ఆడించేలా టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు కథనాలు వచ్చాయి. అయితే దీనికోసం బీసీసీఐ ఓ షరతును పెట్టినట్లు సమాచారం అందింది.
ఆ షరతు ఏంటంటే
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఆడే జట్టును జనవరి 12లోగా ప్రకటించాలి. అయితే ఆ తర్వాత కూడా జట్టులో మార్పులు చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అందుకే 15 మందితో కూడిన జట్టులో మొదట బుమ్రా పేరు ప్రకటిస్తారట. ఆ తర్వాత టోర్నీ ప్రారంభం (ఫిబ్రవరి 19 నుంచి మొదలు) నాటికి బౌలింగ్ వేసేంత ఫిట్‌నెస్ అతడు సాధిస్తేనే, తుది జట్టులో అవకాశం కల్పిస్తామని మేనేజ్‌మెంట్ ఫిక్స్ అయిందట. కాబట్టి బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం నాటికి ఫిట్ నెస్ సాధిస్తే, మెగాటోర్నీ ఆడే అవకాశం ఉంటుంది.
ఇకపోతే మహ్మద్ షమీ కూడా ఛాంపియన్స్ ట్రోఫీ ఆడుతాడా లేదా స్పష్టత లేదు. అతడు కూడా పూర్తి ఫిట్ నెస్ సాధించాల్సి ఉంది. ఒకవేళ సాధించినా తీసుకుంటారో లేదో క్లారిటీ లేదు. ఏదేమైనా వీరిద్దరూ లేకపోతే మాత్రం భారత బౌలింగ్ దళానికి కాస్త ఇబ్బందనే చెప్పాలి.
న్యూజిలాండ్ వైద్యుడితో చికిత్స
వెన్నునొప్పితో బాధపడుతోన్న జస్‌ప్రీత్ బుమ్రా, చికిత్స కోసం న్యూజిలాండ్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రోవన్ స్కౌటెన్‌ను సంప్రదించినట్లు తెలిసింది. ప్రస్తుతం బుమ్రా గాయం పరిస్థితిని డాక్టర్ రోవనే పరిశీలిస్తున్నట్లు తెలిసింది.