
కేప్‌టౌన్: టీమిండియా పేస్ గన్ జస్ప్రీత్ బుమ్రా నాలుగేళ్ల క్రితం ఎక్కడ తన టెస్టు క్రికెట్ కెరీర్ ప్రారంభించాడో, ప్రస్తుతం అక్కడే కీలకమైన సిరీస్ ఫలితాన్ని తేల్చే మూడో టెస్టు ఆడబోతున్నాడు. 2018లో కేప్‌టౌన్ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్ ద్వారా బుమ్రా తన టెస్టు కెరీర్‌ను ప్రారంభించాడు. ఆ మ్యాచ్‌లో బుమ్రా తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు, సెకండ్ ఇన్నింగ్స్‌లో 3 వికెట్లతో సత్తా చాటాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ దక్షిణాఫ్రికా లెజెంజరీ బ్యాటర్ ఏబీ డివిల్లియర్స్‌ను ఔట్ చేశాడు. అయితే ఆ మ్యాచ్‌తో పాటు సిరీస్‌లోనూ టీమిండియా ఓడిపోయినప్పటికీ బుమ్రా మాత్రం సత్తా చాటాడు. ఆ సిరీస్‌లో మొత్తం 14 వికెట్లు పడగొట్టాడు. అంతే అలా మొదలైన బుమ్రా టెస్టు కెరీర్ 4 ఏళ్లుగా దిగ్విజయంగా కొనసాగుతుంది. ఈ క్రమంలో ఇప్పటివరకు 26 టెస్టు మ్యాచ్‌లు ఆడిన బుమ్రా 107 వికెట్లు పడగొట్టాడు. అంతేకాకుండా అత్యంత వేగంగా 100 వికెట్ల మార్క్‌ను అందుకున్న బౌలర్‌గా నిలిచాడు. ఇందులో విదేశాల్లోనే 24 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. ఇప్పటివరకు స్వదేశంలో బుమ్రా 2 టెస్టు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. దీంతో భారత జట్టుకు బుమ్రా విదేశాల్లో ప్రధాన బౌలర్‌గా పేరు తెచ్చుకున్నాడు.
ఈ క్రమంలో కేప్‌టౌన్‌లోని తన మధురు జ్ఞాపకాలను బుమ్రా నెమరవేసుకున్నాడు. నాలుగేళ్ల క్రితం 2018 జనవరిలో కేప్‌టౌన్ వేదికగా తన టెస్ట్ కెరీర్ ప్రారంభించానని, ఇక్కడి నుంచి మంచి ఆటగాడిగా ఎదిగానని గుర్తు చేసుకున్నాడు. మళ్లీ ఈ గ్రౌండ్‌లో ఆడనుండడం సంతోషంగా ఉందని, పాత జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయని బుమ్రా తన ట్విటర్ ఖాతాలో రాసుకొచ్చాడు.
తన కెరీర్‌లో 2019 వెస్టిండీస్ పర్యటనలో బుమ్రా అదరగొట్టాడు. అక్కడ తొలి టెస్టు మ్యాచ్‌లో 5-7తో సంచలన ప్రదర్శన చేసిన బుమ్రా, రెండో టెస్టు మ్యాచ్‌లో హ్యాట్రిక్ వికెట్లతో చెలరేగాడు. దీంతో భారత జట్టు తరఫును హాట్రిక్ వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా నిలిచాడు. అంతేకాకుండా దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌లలో ఒకే క్యాలెండర్ ఇయర్ 5 వికెట్లు పడగొట్టిన తొలి ఆసియా బౌలర్‌గా నిలిచాడు. కాగా ప్రస్తుతం మంగళవారం నుంచి కేప్‌టౌన్ వేదికగా జరగనున్న మూడో టెస్టు మ్యాచ్‌కు బుమ్రా సిద్ధం అవుతున్నాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌కు తిరిగిరానుండగా.. గాయం కారణంగా సిరాజ్ ఆడేది అనుమానంగా మారింది.