మరో రెండు ఫొటోలు:
సంజన గణేశన్‌తో కలిసి వివాహ వేడుక సమయంలో తీసుకున్న మరో రెండు ఫొటోలను జస్ప్రీత్ బుమ్రా శుక్రవారం తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశాడు. 'గతకొన్ని రోజులుగా నా జీవితం అద్భుతంగా ఉంది. మమల్ని దీవించిన, శుభాకాంక్షలు చెప్పిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు' అని బుమ్రా కాప్షన్ రాసుకొచ్చాడు. ఇక్కడివరకు బాగానే ఉంది. అయితే బుమ్రా పంచుకున్న ఫొటోల్లో.. నూతన దంపతులు నడుచుకుంటూ వస్తుండగా ఇరువైపుల ఉన్నవారు బాణసంచా కాల్చడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది. ఈ ఫోటోలపై నెటిజెన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నీ క్రాకర్స్ కాలుష్యం చేయవా:
జస్ప్రీత్ బుమ్రా 2017లో 'దీపావళి' పండగ రోజున ఓ ట్వీట్ చేశాడు. అందరికి శుబాకాంక్షలు చెప్పి.. టపాసులు కాల్చొద్దని అభిమానులను కోరాడు. 2017లో బుమ్రా చేసిన ట్వీట్‌ను ఇప్పుడు నెటిజెన్లు షేర్ చేస్తూ అతడిపై మండిపడుతున్నారు. 'బుమ్రా.. ముందుగా నువ్ పాటించి! ఆ తర్వాత ఇతరులకు నీతులు చెప్పు' అని ఒకరు కామెంట్ చేయగా.. 'మొదట మీరు పాటించండి' అని మరొకరు కామెంట్ చేశారు. 'భాయ్.. ఇంకోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దు', 'మా క్రాకర్స్ కాలుష్యం చేస్తాయి.. నీ క్రాకర్స్ కాలుష్యం చేయవా' అంటూ వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్నారు.

వన్డే సిరీస్‌కు దూరం:
అత్యంత సన్నిహితుల మధ్యనే వివాహం చేసుకున్న జస్ప్రీత్ బుమ్రా.. త్వరలోనే భారత క్రికెటర్లతో పాటు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులందరికి విందు ఇవ్వనున్నట్లు వారి కుటుంబ వర్గాలు తెలిపాయి. భారత్-ఇంగ్లండ్ మధ్య మార్చి 23 నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభంకానుండగా.. ఈ సిరీస్‌లోనూ బుమ్రా ఆడడం లేదు. ఐపీఎల్ 2021 సీజన్ ఏప్రిల్ 9 నుంచి మే 30 వరకూ జరగనున్న విషయం తెలిసిందే. అందులో బుమ్రా ఆడనున్నాడు. మార్చి 26-28 మధ్య ముంబై జట్టుతో అతడు కలుస్తాడని సమాచారం. గత ఏడాది ముంబై ఇండియన్స్ టైటిల్స్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.

అందరికి షాక్:
ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టుకు ముందు జస్ప్రీత్ బుమ్రా వ్యక్తిగత కారణాలతో భారత జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అతడు పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి. బుమ్రా పెళ్లాడేది స్టార్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ అంటూ ఎన్ని వార్తలొచ్చినా అతడు మౌనంగానే ఉన్నాడు. తన పనుల్లో తాను నిమగ్నమయ్యాడు. చివరికి సంజనతో ఒక్కటైన ఫొటోలను స్వయంగా సామాజిక మాధ్యమాల్లో పంచుకొని అందరికి షాక్ ఇచ్చాడు.


Click it and Unblock the Notifications
