అయిదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా భారత్ మరో సమరానికి సిద్ధమైంది. బ్రిస్బేన్‌లోని గబ్బా వేదికగా శనివారం నుంచి మూడో టెస్టు ప్రారంభం కానుంది. భారత కాలమాన ప్రకారం ఉదయం 5.50 గంటలకు మ్యాచ్ మొదలుకానుంది. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా సంపూర్ణ ఆధిపత్యం చెలాయించిన విషయం తెలిసిందే. 295 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
కానీ అడిలైడ్ వేదికగా జరిగిన డే/నైట్ టెస్టులో ఘోర పరాజయాన్ని చవిచూసింది. అన్ని విభాగాల్లో విఫలమై పది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. సిరీస్‌లో ఆధిక్యాన్ని 1-1తో సమం చేసుకుంది. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ రేసులో నిలవాలంటే బోర్డర్ గవాస్కర్ సిరీస్‌ను భారత్ తప్పనిసరిగా గెలవాలి. అయితే స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా పూర్తిస్థాయిలో ఫిట్‌నెస్‌తో లేడని ఆరోపణలు వచ్చాయి. బుమ్రా గాయాన్ని టీమిండియా మేనేజ్మెంట్ దాచిపెడుతుందని ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ డామియన్ ఫ్లెమింగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

అడిలైడ్ టెస్టులో తొలి ఇన్నింగ్స్ ముగిసిన అనంతరం బుమ్రా మైదానంలో ఇబ్బంది పడుతూ కనిపించాడు. ఫిజియో అతనికి చికిత్స చేశాడు. అయితే అది తిమ్మిరి మాత్రమే అని, సమస్య ఏమీ లేదని బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ వివరించాడు. కానీ డామియన్ ఫ్లెమింగ్ మోర్కెల్ వివరణతో ఏకీభవించలేదు. బుమ్రా పరిస్థితిపై తీవ్రమైన అనుమానాలు ఉన్నాయన్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో వేసిన ఓవర్‌లో కాస్త వేగం తగ్గిందని, గాయం గురించి భారత మేనేజ్మెంట్ రహస్యంగా ఉంచుతుందని తెలిపింది.
ఈ ఆరోపణలకు తోడుగా మంగళవారం బుమ్రా ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొనకపోవడంతో టీమిండియా అభిమానుల్లో ఆందోళన పెరిగింది. అయితే గురువారం బుమ్రా తిరిగి ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. అయితే సాధనలో వేగంగా బంతులు సంధించలేదు. ఆఫ్ బ్రేక్ బౌలింగ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. కాగా, బుమ్రా ప్రాక్టీస్‌లో పాల్గొనడంతో భారత అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. కంగారూల గడ్డపై ఆస్ట్రేలియాను ఓడించాలంటే గేమ్ ఛేంజర్ అయిన బుమ్రా భారత జట్టుకు అత్యంత కీలకం.
Jasprit Bumrah started off with a couple of leg-breaks alongside R Ashwin but he’s now running in hot & bowling at full tilt, being an absolute handful to KL Rahul & Yashasvi Jaiswal #AusvInd pic.twitter.com/3IRzE0QXbm
— Bharat Sundaresan (@beastieboy07) December 12, 2024