
హైదరాబాద్: పరిమిత ఓవర్ల క్రికెట్‌లో డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌గా పేరొందిన టీమిండియా పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కేప్ టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. శుక్రవారం భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య ప్రారంభమైన తొలి టెస్టులో ఇషాంత్ శర్మ స్థానంలో జట్టు మేనేజ్‌మెంట్ బుమ్రాకి అవకాశమిచ్చింది.
దీంతో భారత తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేసిన 290వ క్రికెటర్‌గా బుమ్రా రికార్డుల్లో నిలిచాడు. 2016, జనవరి 23న ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో అరంగేట్రం చేసిన బుమ్రా అనతికాలంలోనే జట్టులో నమ్మదగిన బౌలర్‌గా గుర్తింపు పొందాడు.
అయితే తన అరంగేట్రం టెస్టులో క్రీజులో పాతుకుపోయి భారత బౌలర్లను ఇబ్బంది పెడుతోన్న దక్షిణాఫ్రికా వెటరన్ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ ఔట్ చేశాడు. లంచ్ విరామం తర్వాత మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపటికి బుమ్రా వేసిన ఇన్నింగ్స్ 33వ ఓవర్ ఆఖరి బంతికి ఏబీ డివిలియర్స్ బౌల్డ్ అయ్యాడు.
అంతకముందు భారత బౌలర్లు వికెట్ కోసం గంట శ్రమించారు. ఏబీ డివిలియర్స్ వికెట్ తీయడంతో అంతర్జాతీయ క్రికెట్‌లో బుమ్రా 'క్లబ్ ఆఫ్ ఛాంపియన్స్'లో చేరాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో జట్టు కష్ట సమయంలో ఉన్నప్పుడు ప్రధాన వికెట్ తీసి ప్రత్యర్ధి జట్టుని కష్టాల్లో పడేయడం బుమ్రా నైజం.
అయితే తన తొలి టెస్టులో బుమ్రా మళ్లీ అదే చేసి చూపించాడు. అప్పటికే క్రీజులో పాతుకుపోయిన డివిలియర్స్, డుప్లెసిస్ జోడీని 114 పరుగుల భాగస్వామ్యం వద్ద బుమ్రా విడదీసి తానెంత విలువైన బౌలర్‌నో మరోసారి నిరూపించుకున్నాడు. అంతకముందు డివిలియర్స్ టెస్టుల్లో 41వ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు.
అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే ఐపీఎల్, వన్డేలు, టెస్టులు, టీ20లు ఇలా అన్నింటిలో కూడా బుమ్రా తీసుకున్న తొలి వికెట్లు అన్నీ స్టార్ ప్లేయర్లవి కావడం విశేషం. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరుపున ఆడుతున్న బుమ్రా తన తొలి వికెట్‌గా విరాట్ కోహ్లీని, వన్డేల్లో స్టీవ్ స్మిత్, టీ20ల్లో డేవిడ్ వార్నర్, టెస్టుల్లో ఇప్పుడు డివిలియర్స్.
ఇదిలా ఉంటే ఈ రెండేళ్ల కాలంలో 31 వన్డేలాడిన బుమ్రా 56 వికెట్లు తీశాడు. వన్డేల్లో బుమ్రా బెస్ట్ 27/5గా ఉంది. ఇక టీ20ల్లో బుమ్రా వేసే డెత్ ఓవర్ల బౌలింగ్ ప్రత్యేకం. ఇప్పటివరకు తన కెరీర్‌లో 32 టీ20లాడిన బుమ్రా 40 వికెట్లు తీశాడు. టీ20ల్లో బుమ్రా అత్యుత్తమం 11/3.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.