
లండన్: మాజీ కెప్టెన్ డారెన్ సమీ ఏం చెప్పాడో నాకు తెలియదు కానీ వర్ణవివక్ష అనేది కచ్చితంగా మనందరి మధ్యా ఉంది అని వెస్టిండీస్ కెప్టెన్ జేసన్ హోల్డర్ అన్నాడు. క్రికెట్‌లో వర్ణవివక్ష లేదని చెప్పడం అవివేకం అవుతుందన్నాడు. ఇటీవల డారెన్ సమీ ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ తరఫున ఆడేటప్పుడు వర్ణవివక్ష ఎదుర్కొన్నానని చేసిన వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో దుమారం రేపాయి. అమెరికాలో నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ ఉదంతంతో క్రికెట్‌లోనూ వర్ణ వివక్ష ఉందంటూ ఆటగాళ్లు ఒక్కొక్కరుగా గళం విప్పుతున్నారు.
జేసన్ హోల్డర్ తాజాగా ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ఫోతో మాట్లాడుతూ వర్ణవివక్షపై స్పందించాడు. 'నేనిక్కడ కూర్చొని క్రికెట్‌లో వర్ణవివక్ష లేదని చెబితే అది నాకు అవివేకంగా అనిపిస్తుంది. డారెన్ సమీ ఏం చెప్పాడో నాకు తెలియదు కానీ వర్ణవివక్ష అనేది కచ్చితంగా మనందరి మధ్యా ఉంది. అన్ని రంగాల్లో సమానత్వంతో పాటు, ఐకమత్యాన్ని తీసుకువస్తేనే దానికి పరిష్కారం లభిస్తుంది. అందరిని ఒకేచోటకు తీసుకొచ్చే సమానత్వాన్ని మనం ప్రోత్సహించాలి. దాంతో సమాజంలో గొడవలు, హత్యలు, ప్రతికూలతలు తగ్గిపోతాయి' అని హోల్డర్ అన్నాడు.
'వర్ణవివక్ష అనేది ప్రపంచంలో ఎక్కడైనా నేరమే. మనం పోయిన తర్వాత కూడా ఇది చర్చనీయాంశంగానే మిగులుతుంది. ఈ మొత్తం అనుభవాల నుంచి మనం తీసుకొచ్చే గొప్ప సందేశం ఏంటంటే.. ఐకమత్యమేనని నేను భావిస్తున్నా. జాతి, వర్ణ, కుల, మత బేధాలు లేకుండా మనమంతా కలిసికట్టుగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇటీవల ఏం జరిగిందనే దానిపై ప్రపంచం మొత్తం స్పందించింది. ప్రజల నుంచి విశేషమైన స్పందన వస్తోంది. ఐకమత్యమే గొప్ప విషయం. దీనికోసం మనమంతా ముందుకు రావాలి' అని హోల్డర్ పిలుపునిచ్చాడు.
తాజాగా భారత మాజీ ఓపెనర్, క్రికెట్ వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా తాను ఎదుర్కొన్న వర్ణవివక్షను వివరించాడు. తాజాగా ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ చానెల్ ద్వారా మాట్లాడుతూ... 'ఏదో ఒక దశలో మేం కూడా వివక్ష బాధితులమే. ఇంగ్లండ్ క్రికెట్ లీగ్‌లో ఆడుతున్నప్పుడు ప్రత్యర్థి జట్టులోని ఇద్దరు దక్షిణాఫ్రికా ఆటగాళ్లు నన్ను 'పాకీ' అని పిలిచారు. నేను నాన్ స్ట్రయికింగ్ ఎండ్‌లో ఉన్నప్పటికీ వాళ్లు పదేపదే అదే పదంతో సంబోధిస్తూ అవమానించారు. పాకిస్థాన్‌ను పాకీగా పిలుస్తారని ఎంతో మంది అనుకుంటారు. కానీ అది నిజం కాదు. గోధుమ రంగులో ఉన్న వారిపై, ఆసియా ఉపఖండానికి చెందిన వారిపై వర్ణవివక్ష చూపిస్తూ పాకీ అని హేళన చేస్తారు.. ఇంగ్లండ్‌లో ఎవరైనా నిన్ను పాకీ అని అంటే.. వాళ్ల ఉద్దేశం ఏంటో మనకు సులువుగా అర్థమైపోతుంది. ఆ సమయంలో నాకు జట్టు అండగా నిలిచింది' అని చెప్పాడు.