హైదరాబాద్: మార్చి 4 నుంచి బెంగుళూరులో జరిగే రెండో టెస్టుకు ఆస్ట్రేలియా జట్టులోకి మిచెల్ మార్ష్ స్థానంలో స్పిన్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను తీసుకోవడమే మంచిదని ఆ దేశ మాజీ పేసర్ జాసన్ గిలెస్పీ పేర్కొన్నాడు.
తద్వారా భారత పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా జట్టు ఇంకా బలంగా ఉంటుందని గిలెస్పీ పేర్కొన్నాడు. నాలుగు టెస్టు మ్యాచ్‌ల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇంకా మూడు టెస్టులు ఆడాల్సిన తరుణంలో తుది జట్టులోకి మ్యాక్స్‌వెల్‌ను తీసుకోవాలని సెలక్టర్లకు సూచించాడు.
'భారత పర్యటనలో ఉన్న ఆసీస్ జట్టు ఏమైనా మార్పులు చేయాలనుకుంటే మిగతా టెస్టు మ్యాచ్‌లకు మ్యాక్స్‌వెల్‌ను తుది జట్టులో తీసుకోండి. మ్యాక్సీని జట్టులో తీసుకుంటే ఆసీస్ ఇంకా బలపడుతుంది. భారత్‌లో స్పిన్‌ను ధైర్యంగా ఎదుర్కొనే ఆటగాళ్లలో మ్యాక్స్‌వెల్ ఒకడు' అని చెప్పాడు.

'ఇద్దరు సీమర్లతో ఆడాలని భావిస్తే, మిచెల్ మార్ష్ స్థానంలో అతన్ని వేసుకుంటే మంచిది. ఆసీస్ మరింత సమర్ధవంతంగా సిరీస్‌లో ముందుకెళుతుంది' అని గిలెస్పీ సెలక్టర్లకు సూచించాడు. నాలుగు టెస్టుల సిరిస్‌లో భాగంగా పూణెలో జరిగిన తొలి టెస్టులో ఆసీస్ విజయం సాధించడంతో సిరిస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది.
తద్వారా 12 ఏళ్ల తర్వాత భారత్‌లో ఆస్ట్రేలియా టెస్టు మ్యాచ్‌ని గెలిచింది. అంతేకాదు 19 వరుస విజయాలతో దూసుకుపోతున్న కోహ్లీ సేనను విజయ పరంపరకు కూడా ఆస్ట్రేలియా బ్రేక్ వేసింది. స్వదేశంలో కోహ్లీ ఓటమి పాలైన తొలి టెస్టు కూడా ఇదే కావడం విశేషం.