4,6,4,4,4,6: తన బౌలింగ్‌లో ఉతికారేసిన మ్యాక్స్‌వెల్‌కు.. ఊహించని బహుమతి ఇచ్చిన నీషమ్!

వెల్లింగ్టన్: మైదానంలో బ్యాట్స్‌మెన్, బౌలర్ ఎప్పుడూ ఒకరిపై మరొకరు పైచేయి సాదించాడనికి చూస్తుంటారు. ఓ బౌలర్ తన వికెట్ తీస్తే.. తర్వాతి మ్యాచులో అతడి బౌలింగ్‌ను ఉతికారేయాలని బ్యాట్స్‌మెన్ అనుకుంటాడు. అదే ఓ బ్యాట్స్‌మెన్ ప్రత్యర్థి బౌలర్‌ను చెడుగుడు ఆడితే.. తరువాతి మ్యాచ్‌లో అతని వికెట్ తీసేందుకు ఆ బౌలర్ ప్రయత్నిస్తుంటాడు. కానీ న్యూజిలాండ్‌కు చెందిన జేమ్స్ నీషమ్ మాత్రం ఈ విషయంలో తన ప్రత్యేకతను చాటుకున్నాడు. తన బౌలింగ్‌ను ఉతికారేసిన ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌కు ఊహించని కానుక ఇచ్చి అతన్ని ఆశ్చర్యపరిచాడు.

4,6,4,4,4,6:
తాజాగా ఆస్ట్రేలియా 5 టీ20ల కోసం న్యూజిలాండ్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. వెల్లింగ్టన్ వేదికగా ఇరు జట్ల మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో నీషమ్ బౌలింగ్‌ను గ్లెన్ మ్యాక్స్‌వెల్ చెడుగుడు ఆడేశాడు. ఇన్నింగ్స్ 17వ ఓవర్‌ను నీషమ్ వేశాడు. ఆ ఓవర్‌లోని ఆరు బంతులను మ్యాక్సీ బౌండరీలుగా బాదాడు. 4,6,4,4,4,6 బాది మొత్తం ఆ ఓవర్లో 28 పరుగులు రాబట్టాడు. దీంతో నీషమ్ తన 4 ఓవర్ల కోటాలో ఒక వికెట్ కూడా తీయకుండా 60 పరుగులు సమర్పించుకున్నాడు.

మ్యాక్స్‌వెల్‌కు కానుక:
ఏ బౌలర్ అయినా తన బౌలింగ్‌ను చీల్చి చెండాడిన బ్యాట్స్‌మన్‌ను అదే మ్యాచులో అయినా లేదా తర్వాతి మ్యాచులో అయినా ఔట్ చేసి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తాడు. కానీ జేమ్స్ నీషమ్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించాడు. నీషమ్ తన జెర్సీని మ్యాక్సీకి కానుకగా ఇచ్చాడు. 'టు.. మ్యాక్సీ. 4,6,4,4,4,6. బై నీషమ్' అంటూ రాసి మ్యాక్సీకి అందజేశాడు. నీషమ్ ప్రేమగా తన జెర్సీని ఇవ్వడంతో నవ్వుతూ తీసుకున్న మ్యాక్సీ.. తన జెర్సీని నీషమ్‌కు ఇచ్చాడు. ఒకరి జెర్సీలు ఒకరు మార్చుకున్న సమయంలో దిగిన ఫోటోను వారు సోషల్ మీడియాలో పంచుకున్నారు.

ఐపీఎల్ వల్లే ఇది సాధ్యం:
జేమ్స్ నీషమ్, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌లకు సంబందించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానులు తమదైన స్టయిల్లో కెమెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 'ఐపీఎల్ టోర్నీ వల్లే ఇది సాధ్యం అయింది' అని ఒకరు కామెంట్ చేయగా.. 'అంతా పంజాబ్ కింగ్స్ మహిమ' అని మరొకరు ట్వీట్ చేశారు. ఐపీఎల్ 2020లో పంజాబ్ కింగ్స్ కోసం వీరిద్దరూ కలిసి ఆడిన విషయం తెలిసిందే. గత సీజన్లో మ్యాక్సీ పూర్తిగా విఫలమవగా.. నీషమ్‌కు ఎక్కువగా ఆడే అవకాశాలు రాలేదు. మ్యాక్స్‌వెల్ ఈసారి బెంగళూరు తరఫున ఆడనుండగా.. నీషం ముంబైకి ఆడనున్నాడు.

టీ20 సిరీస్ గెలిచిన కివీస్:
న్యూజిలాండ్, ఆస్ట్రేలియా మధ్య 5 టీ20ల సిరీస్‌ను కివీస్ 3-2 తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆదివారం జరిగిన చివరి టీ20లో కివీస్ 7 వికెట్ల తేడాతో ఆసీస్‌పై గెలిచి సిరీస్‌ను సొంతంచేసుకుంది. మొదట ఆసీస్ 8 వికెట్లకు 142 పరుగులు చేసింది. వేడ్ (44), ఫించ్ (36) రాణించారు. అనంతరం లక్ష్యఛేదనలో మార్టిన్ గప్టిల్ (46 బంతుల్లో 71; 7 ఫోర్లు, 4 సిక్సర్లు), కాన్వే (36), ఫిలిప్స్ (34 నాటౌట్) అదరగొట్టడంతో న్యూజిలాండ్ 15.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 143 పరుగులు చేసింది.
అప్పటికీ ఆస్ట్రేలియా బౌలర్లను హెచ్చరించా.. స్లో ఓవర్‌రేట్ మా కొంపముంచింది: లాంగర్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications