తొలి బంతికే వికెట్:
ఇంగ్లండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దక్షిణాఫ్రికా ఓపెనర్లు డీన్ ఎల్గర్, ఐడెన్ మర్కరమ్‌లు క్రీజులోకి వచ్చారు. ఇంగ్లండ్ తొలి ఓవర్‌ను అండర్సన్ వేస్తుండగా.. స్టైకింగ్ ఎండ్‌లో ఎల్గర్ ఉన్నాడు. తొలి బంతిని అండర్సన్ లెగ్ సైడ్‌కు సంధించగా.. అదికాస్తా ఎల్గర్ బ్యాట్‌ను తాకుతూ కీపర్ జోస్ బట్లర్ చేతుల్లో పడింది. దీంతో ఎల్గర్ గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరాడు. అండర్సన్ ఖాతాలో అరుదైన రికార్డు చేరింది.
లక్మల్ రెండు సార్లు:
ఈ దశాబ్దంలో టెస్టుల్లో తొలి బంతికే వికెట్ సాధించిన వారిలో దక్షిణాఫ్రికా పేసర్ డేల్ స్టెయిన్ (2010- ఆండ్రూ స్ట్రాస్), శ్రీలంక పేసర్ సురంగా లక్మల్ (2010-క్రిస్ గేల్), ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ (2016-దిముత్ కరుణరత్నే), సురంగా లక్మల్ (2017-కేఎల్ రాహుల్)లు మొదటి నాలుగు స్థానాల్లో ఉన్నారు. తాజాగా వీరి సరసన అండర్సన్ చేరాడు. సురంగా లక్మల్ రెండు సార్లు తన మొదటి బంతికే వికెట్ సాధించడం విశేషం.
అండర్సన్ @ 150:
ఈ టెస్ట్ మ్యాచ్ అండర్సన్‌కు 150వది. దీంతో టెస్ట్ క్రికెట్ చరిత్రలో 150వ టెస్ట్ మ్యాచ్ ఆడిన తొలి బౌలర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. పేస్ బౌలర్లలో అత్యధిక టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన జాబితాలో స్టువర్ట్ బ్రాడ్ (135) రెండవ స్థానంలో ఉన్నాడు. వెస్టిండీస్ మాజీ పేసర్ కోర్ట్నీ వాల్ష్ (132) మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.
రెండో ఇంగ్లీష్ క్రికెటర్‌గా రికార్డు:
అండర్సన్ మరో రికార్డు కూడా నెలకొల్పాడు. 150 టెస్టులు ఆడిన రెండో ఇంగ్లీష్ క్రికెటర్‌గా జిమ్మీ రికార్డు సృష్టించాడు. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ (161) మాత్రమే అండర్సన్ కంటే ముందున్నాడు. ఇక క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు 9 మంది మాత్రమే టెస్ట్ ఫార్మాట్లో 150 మ్యాచ్‌లు ఆడారు. ఈ జాబితాలో భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ (200) అగ్ర స్థానంలో ఉన్నాడు. రికీ పాంటింగ్ (168), స్టీవ్ వా (168), జాక్వస్ కలిస్ (166), శివ నరేన్ చంద్రపాల్ (164), రాహుల్ ద్రవిడ్ (164), అలిస్టర్ కుక్ (161), అలెన్ బోర్డర్ (156)లు వరుసగా ఉన్నారు.