లక్నో సూపర్ జెయింట్స్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. సొంతమైదానంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో లక్నో ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా (57*; 40 బంతుల్లో, 5x4, 1x6) టాప్ స్కోరర్.
ఆఖర్లో ఎంఎస్ ధోనీ (28; 9 బంతుల్లో, 3x4, 2x6) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. అజింక్య రహానె (36; 24 బంతుల్లో, 5x4, 1x6), మొయిన్ అలీ (30; 20 బంతుల్లో, 3x6) ఫర్వాలేదనిపించారు. లక్నో బౌలరల్లో కృనాల్ పాండ్య (2/16) రెండు వికెట్లతో సత్తాచాటాడు. అనంతరం ఛేదనలో లక్నో సూపర్ జెయింట్స్ 19 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది.

కేఎల్ రాహుల్ (82; 53 బంతుల్లో, 9x4, 3x6) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. క్వింటన్ డికాక్ (54; 43 బంతుల్లో, 5x4, 1x6) ఆకట్టుకున్నాడు. రాహుల్-డికాక్ తొలి వికెట్‌కు 134 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. నికోలస్ పూరన్ (23*; 12 బంతుల్లో, 3x4, 1x6) మెరిశాడు. అయితే ఆఖరి వరకు అజేయంగా నిలబడి జట్టును విజయ తీరాలకు చేర్చాలనుకున్న రాహుల్ ఆశలకు జడేజా బ్రేక్‌లు వేశాడు. అద్భుతమైన ఫీల్డింగ్ ప్రదర్శనతో రాహుల్‌ను జడ్డూ ఔట్ చేశాడు.
పతిరన వేసిన 18వ ఓవర్ తొలి బంతిని రాహుల్ బౌండరీకి ప్రయత్నించాడు. బ్యాక్‌వర్డ్ పాయింట్‌లో ఫీల్డింగ్ చేస్తున్న జడేజా తన ఎడమవైపునకు గాల్లోకి దూకి ఒంటిచేత్తో క్యాచ్‌ను అందుకున్నాడు. ఇదంతా రెప్పపాటులో జరిగింది. కేఎల్ రాహుల్‌తో పాటు సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కూడా అసాధారణ క్యాచ్‌ను చూసి ఆశ్చర్యపోయాడు. బుల్లెట్‌లా దూసుకెళ్లిన బంతిని సునాయాసంగా జడేజా అందుకున్నాడని, ఇది క్యాచ్ ఆఫ్ ది ఐపీఎల్ అవుతుందని వ్యాఖ్యాత రవిశాస్త్రి కూడా పేర్కొన్నాడు. ఫీల్డర్‌గా జడేజా బాక్సాఫీస్ అని మరో వ్యాఖ్యాత హర్షా భోగ్లే కొనియాడాడు.