
కోల్‌కత: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కోల్‌కత నైట్‌రైడర్స్ ఫ్రాంఛైజీ యాజమాన్యం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. కేకేఆర్ జట్టు ప్రధాన కోచ్, దక్షిణాఫ్రికా మాజీ ఆల్ రౌండర్ జాక్వెస్ కలిస్‌ను సాగనంపింది. హెచ్ కోచ్‌గా కలిస్ కాంట్రాక్ట్ కాలాన్ని పొడిగించట్లేదు. ఫలితంగా- ఆయన తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. కలిస్‌తో పాటు కేకేఆర్ సహాయక కోచ్ సైమన్ కటిచ్ కూడా బాధ్యతల నుంచి తప్పుకొన్నారు. ఈ మేరకు కోల్‌కత నైట్‌రైడర్స్ యాజమాన్యం ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది.
కోచ్‌గా కలిస్ సేవలు అసమానం
తమ జట్టు ప్రధాన కోచ్‌గా జాక్వెస్ కలిస్ అనితరసాధ్యమైన సేవలను అందించారని కోల్‌కత నైట్ రైడర్స్ ఫ్రాంఛైజీ ముఖ్య కార్యనిర్వహణాధికారి వెంకీ మైసూర్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. తొమ్మిదేళ్ల పాటు ఆయన తమ జట్టుతో ముడిపడి ఉన్నారని పేర్కొన్నారు. తమ కుటుంబంలో ఒకరిగా ఉన్నారని, జట్టును అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారని వెంకీ మైసూర్ కొనియాడారు. కలిస్ చేసిన కృషి వల్లే ఐపీఎల్‌లో ప్రతి సీజన్‌లోనూ తమ జట్టు అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించిందని చెప్పుకొచ్చారు. జట్టులో మార్పులు చేయాలంటూ ఫ్రాంఛైజీ యాజమాన్యం తీసుకున్న నిర్ణయం వల్ల కలిస్ సహా సైమన్ కటిచ్, ఇతర టీమ్ సపోర్టింగ్ స్టాఫ్‌ను కూడా మార్చబోతున్నట్లు తెలిపారు.
2011లో కోల్‌కత నైట్ రైడర్స్ ఆటగాడిగా
దక్షిణాఫ్రికా ఆల్ రౌండర్ జాక్వెస్ కలిస్ 2011లో తొలిసారిగా కోల్‌కత నైట్ రైడర్స్ జట్టులో ఆటగాడిగా చేరారు. నాలుగేళ్ల పాటు మ్యాచ్‌లు ఆడారు. 400కు పైగా పరుగులు చేశారు. 15 వికెట్లను పడగొట్టారు. ఐపీఎల్ సహా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తరువాత ఆయనను వదులుకోవడానికి ఇష్టపడలేదు కేకేఆర్ ఫ్రాంఛైజీ యాజమాన్యం. ఆయనను ప్రధాన కోచ్‌గా నియమించుకుంది. 2015 నుంచి ఈ ఏడాది వరకూ కోల్‌కత నైట్ రైడర్స్‌కు కలిసే ప్రధాన కోచ్. తాజాగా ఆయన ఈ పదవి నుంచి తప్పుకొన్నారు. కోల్‌కత నైట్ రైడర్స్‌లో పెద్ద ఎత్తున మార్పులు చోటు చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే- ప్రధాన కోచ్ మొదలుకుని, సహాయ కోచ్, సపోర్టింగ్ సిబ్బందిని కూడా తొలగించారు.