
హైదరాబాద్: టీమిండియా మాజీ క్రికెటర్ జాకబ్ మార్టిన్ ప్రమాద గాయం నుంచి కోలుకుంటున్నారు. ప్రస్తుతం జాకబ్ కోలుకుంటున్నారని, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉండటంతో ఐసీయూ నుంచి జనరల్ వార్డుకి మార్చినట్లు వైద్యులు తెలిపారు. డిసెంబరు 28న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన జాకబ్ మార్టిన్ ఊపిరితిత్తులు, కాలేయం పూర్తిగా దెబ్బతిన్నాయి.
దీంతో నెలరోజులుగా ఆయన వడోదరలోని ఓ ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. జాకబ్ మార్టిన్‌కు ఆర్ధిక సమస్యలు తలెత్తడంతో చికిత్స చేయడం కష్టంగా మారింది. ఈ విషయం తెలుసుకుని మార్టిన్‌కు సాయం చేసేందుకు టీమిండియా మాజీలు, క్రికెటర్లు, బీసీసీఐ, బరోడా క్రికెట్ అసోసియేషన్ ముందుకొచ్చిన సంగతి తెలిసిందే.
జాకబ్ మార్టిన్ వైద్య ఖర్చుల నిమిత్తం రోజుకు 70,000 ఖర్చవుతున్నాయి. జాకబ్ మార్టిన్ చికిత్స కోసం బీసీసీఐ రూ.5 లక్షలు, బరోడా క్రికెట్ అసోసియేషన్ రూ.3 లక్షలు ఇచ్చాయి. మార్టిన్ పరిస్థితి గురించి తెలుసుకున్న టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అండగా ఉంటూ తనవంతు ఆర్థిక సాయం చేశారు.
మరోవైపు కృనాల్ పాండ్యా జాకబ్ మార్టిన్‌కు ఓ బ్లాంక్ చెక్‌ను పాండ్యా ఇచ్చిన సంగతి తెలిసిందే. జాకబ్ ఆరోగ్య పరిస్థితి గురించి బీసీసీఐ, సీఓఏ అధికారులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారని మాజీ బరోడా ఓపెనర్ రాకేశ్ పారిఖ్ తెలిపాడు. బరోడా క్రికెట్ జట్టు కెప్టెన్‌గా వ్యవహరించిన జాకబ్ మార్టిన్ మొత్తం పది వన్డేలాడి మార్టిన్ 158 పరుగులు చేశాడు.