క్రికెట్ చరిత్రలో ఎవరూ ఊహించని రీతిలో ఇంగ్లాండ్ యువ బ్యాటర్ జాకబ్ బెథెల్ ఓ అద్భుతమైన ఘనతను నమోదు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లోని మూడు ఫార్మాట్లు.. టెస్టు, వన్డే, టీ20లలో తన కెరీర్లోని తొలి సెంచరీలను దేశవాళీ క్రికెట్‌లో కాకుండా నేరుగా అంతర్జాతీయ వేదికపైనే సాధించడం విశేషం. ఈ రికార్డుతో ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఇలాంటి ఘనత సాధించిన మొట్టమొదటి ఆటగాడిగా జాకబ్ బెథెల్ తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నారు.
ఆసక్తికరంగా సాగిన బెథెల్ ప్రయాణం
జాకబ్ బెథెల్ కెరీర్ ప్రయాణం ఎంతో ఆసక్తికరంగా సాగింది. 2024లో ఇంగ్లాండ్ జట్టులోకి అడుగుపెట్టినప్పుడు ఆయన డొమెస్టిక్ క్రికెట్లో(ఫస్ట్ క్లాస్, లిస్ట్-ఏ లేదా టీ20) ఒక్క సెంచరీ కూడా చేయలేదు. అయినప్పటికీ ఆయనలోని ప్రతిభను గుర్తించిన ఇంగ్లాండ్ సెలక్టర్లు అరంగేట్రం చేసే అవకాశం కల్పించారు. తన 135వ ప్రొఫెషనల్ మ్యాచ్‌లో మొదటి సెంచరీని నమోదు చేసిన జాకబ్ బెథెల్.. ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. గతేడాది దక్షిణాఫ్రికాపై వన్డేల్లో తన తొలి అంతర్జాతీయ శతకాన్ని బాదగా.. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియాపై 154 పరుగుల భారీ ఇన్నింగ్స్‌తో టెస్టుల్లో తొలి సెంచరీని అందుకున్నారు.

భారత బౌలర్లను ఉక్కిరిబిక్కరి చేసిన యువకెరటం
తాజాగా 2026 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్స్‌లో భారత్‌తో జరిగిన కీలక పోరులో జాకబ్ బెథెల్ మరోసారి తన విశ్వరూపాన్ని ప్రదర్శించారు. భారత్ నిర్దేశించిన 254 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో నాలుగో స్థానంలో వచ్చిన ఈ 22 ఏళ్ల యువ కెరటం కేవలం 48 బంతుల్లోనే 105 పరుగులు చేసి వీరోచిత పోరాటం చేశారు. ఈ ఇన్నింగ్స్‌లో ఆయన 8 ఫోర్లు, 7 సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లను ఉక్కిరిబిక్కిరి చేశారు. టీ20 ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్‌లలో ఇది అత్యధిక వ్యక్తిగత స్కోరును కూడా నమోదైంది.
చరిత్ర సృష్టించాడు..
ఈ శతకంతో అంతర్జాతీయ క్రికెట్లోని మూడు ఫార్మాట్లలోనూ సెంచరీలు చేసిన ప్రపంచంలోని 34వ పురుష క్రికెటర్‌గా జాకబ్ బెథెల్ నిలిచాడు. ఇంగ్లాండ్ జట్టు తరఫున జోష్ బట్లర్, డేవిడ్ మలాన్, హ్యారీ బ్రూక్ తర్వాత ఈ క్లబ్‌లో చేరిన నాలుగో ఆటగాడిగా ఆయన చరిత్ర సృష్టించాడు. అంతేకాకుండా.. ఇంగ్లాండ్ తరపున అత్యంత వేగంగా ఈ మూడు ఫార్మాట్లలో సెంచరీలు పూర్తి చేసిన బ్యాటర్‌గా రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. తన బ్యాటింగ్‌తో ఇంగ్లాండ్‌ను విజయతీరాలకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఆయన చూపిన తెగువ.. ప్రపంచ క్రికెట్‌లో ఆయనను ఒక స్టార్‌గా నిలబెట్టింది.