
వార్నర్ ఛరిష్మా..
ఇంకో రెండు మ్యాచులు చేతుల్లో ఉన్నా.. వాటిల్లో గెలిచినా ఎలాంటి ఉపయోగం ఉండదు. ఈ ఘోర వైఫల్యాలు సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానుల్లో తీవ్ర ఆగ్రహావేశాలకు దారి తీశాయి. మిగిలిన ఫ్రాంఛైజీలతో పోల్చుకుంటే సన్‌రైజర్స్ ఉన్న బ్యాటింగ్, బౌలింగ్ వనరులు పరిమితమే. అయినప్పటికీ- ఉన్న ఆ కొద్దిపాటి వనరులతోనే ఇదివరకు అద్భుతాలను సృష్టించింది. ప్లేఆఫ్స్ దశకు చేరుకుంది. 2016లో ఛాంపియన్‌గా కూడా ఆవిర్భవించింది. దీనికి కారణం- డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ బ్యాటింగ్ శైలి.. అతని కేప్టెన్సీ.

గాడి తప్పిన సన్‌రైజర్స్..
న్యూజిలాండ్ స్కిప్పర్ కేన్ విలియమ్సన్ కేప్టెన్సీలోనూ సన్‌రైజర్స్ సత్తా చాటిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ సారి మాత్రం ఏదీ కలిసి రాలేదు. స్టార్ ఓపెనర్ జానీ బెయిర్‌స్టో అందుబాటులో లేకుండాపోవడం, డేవిడ్ వార్నర్ ఫామ్‌ను కోల్పోవడం, కేన్ విలియమ్సన్ గాయాల బారిన పడి ఆలస్యంగా జట్టులోకి రావడం.. ఇవన్నీ సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్, బౌలింగ్‌ను గాడి తప్పేలా చేశాయి. ఆటగాళ్లల్లో నిరుత్సాహాన్ని నింపాయి.

వార్నర్‌ను పక్కన పెట్టడంపై
అదే సమయంలో డేవిడ్ వార్నర్‌ను పక్కన పెట్టడం జట్టుపై మరింత విమర్శల జడివాన కురవడానికి కారణమైంది. వార్నర్ వంటి క్వాలిటీ బ్యాట్స్‌మెన్‌ను తుదిజట్టులోకి తీసుకోకపోవడంతో అభిమానులు మరింత ఆగ్రహోదగ్రులయ్యారు. దారుణంగా ట్రోల్ చేశారు. వార్నర్ చివరికి జట్టుకు దూరంగా స్టాండ్స్‌లో కూర్చోవడం ఫ్యాన్స్ ఆవేశాన్ని పీక్స్‌కు తీసుకెళ్లినట్టయింది. వార్నర్‌ను తుదిజట్టులోకి తీసుకోకూడదనే టీమ్ మేనేజ్‌మెంట్ వ్యూహం ఏ మాత్రం ఫలితానివ్వలేదు..ఒక్క మ్యాచ్‌లో విజయాన్ని తప్ప.

లిసా ఘాటు వ్యాఖ్యలు..
వార్నర్‌ను పక్కన పెట్టడాన్ని ఆస్ట్రేలియన్ మాజీ మహిళా క్రికెటర్ కమ్ కామెంటేటర్ లిసా స్థలేకర్ తప్పు పట్టారు. 2016లో జట్టును ఛాంపియన్‌గా నిలబెట్టిన వార్నర్ వంటి బ్యాటింగ్ లెజెండర్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్‌లో సరైన గౌరవం దక్కలేదంటూ నిప్పులు చెరిగారు. స్టాండ్స్‌లో కూర్చున్న వార్నర్‌ను చూసి తన గుండె పగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి సన్నివేశాన్ని చూడాల్సి వస్తుందని తాను అనుకోలేదని చెప్పారు. చివరి మ్యాచ్‌లో అయినా సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్.. వార్నర్‌కు ఆడే అవకాశాన్ని ఇవ్వాలని అన్నారు.

చివరి మ్యాచ్‌లో అయినా..
జట్టును పలుమార్లు ప్లేఆఫ్స్, సెమీఫైనల్స్‌కు తీసుకెళ్లిన ఘనత వార్నర్‌కు ఉందని లిసా స్థలేకర్ చెప్పుకొచ్చారు. వార్నర్‌కు తుదిజట్టులో చోటు కల్పించకపోవడానికి గల కారణాలేమిటో తనకు తెలియదని, అలాంటి పరిస్థితిని కల్పించడం మాత్రం సరికాదని అన్నారు. చివరి మ్యాచ్‌లో వార్నర్‌ను ఆడనివ్వడం ద్వారా కనీసం హైదరాబాద్ జట్టు అభిమానుల మనసులను టీమ్ మేనేజ్‌మెంట్ గెలుచుకోగలుగుతుందని అభిప్రాయపడ్డారు. ఈ సాయంత్రం సన్‌రైజర్స్ హైదరాబాద్.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో ఆడనుంది. శుక్రవారం జరిగే తన చిట్టచివరి లీగ్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను ఢీ కొట్టాల్సి ఉంది. ఈ రెండు గెలిచినా ఒరిగేదేమీ ఉండదు.


Click it and Unblock the Notifications












