న్యూఢిల్లీ: భారత డాషింగ్ ఓపెనర్‌గా వచ్చి బౌలర్లకు చుక్కలు చూపిన వీరేంద్ర సెహ్వాగ్ అంతర్జాతీయ క్రికెట్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ సహా అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. అక్టోబర్ 20న వీరేంద్ర సెహ్వాగ్ తన 37వ పుట్టిన రోజునే రిటైర్మెంట్ ప్రటించడం గమనార్హం.

ఈ మేరకు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు తన ట్విట్టర్ ఖాతాలో సెహ్వాగ్ అధికారికంగా ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లతోపాటు ట్వంటీ20 టోర్నమెంట్ అయిన ఐపిఎల్‌కు కూడా సెహ్వాగ్ గుడ్‌బై చెప్పాడు.
'ఇండియన్ ప్రీమియర్ లీగ్‌తోపాటు అంతర్జాతీయ అన్ని ఫార్మాట్లకు నేను రిటైర్మెంట్ ప్రకటిస్తున్నా. తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది' అని సెహ్వాగ్ మంగళవారం మధ్యాహ్నం తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశాడు.
తనకు అన్ని విధాలా సహకరించిన ఢిల్లీ డేర్‌డెవిల్స్, కింగ్స్ లెవన్ పంజాబ్, ఓఎన్జీసీ, ఫ్రాంఛైజీలు, అభిమానులు అందరికి సెహ్వాగ్ కృతజ్ఞతలు తెలిపాడు. తన నిర్ణయం బాధించివుంటే క్షమించాలని కోరాడు.'దేవుడి దయ వల్ల క్రికెట్ మైదానం నేను చేయాల్సింది చేశాను. ఇక నా 37వ పుట్టిన రోజున క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నా' అని పేర్కొన్నాడు. 'ఇక ఈ రోజు నుంచి నా కుటుంబంతో గడుపుతా' అని తెలిపాడు.
1999లో మొహాలీలో పాకిస్థాన్‌తో జరిగిన వన్డేతో వీరేంద్ర సెహ్వాగ్ తన తొలి అంతర్జాతీయ వన్డేలో ఆడాడు. 104 టెస్టులు, 251 వన్డేలు, 19 ట్వంటీ20అంతర్జాతీయ మ్యాచులు ఆడాడు. 'నవాబ్ ఆఫ్ నజాఫ్‌గఢ్'గా పేరొందిన సెహ్వాగ్ అంతర్జాతీయ మ్యాచుల్లో 17,000పరుగులను పూర్తి చేశాడు.
భయం లేని తన బ్యాటింగ్‌తో సెహ్వాగ్ తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఏ బౌలర్ అని చూడకుండా తనదైన శైలిలో భారీ షాట్లతో దూకుడుగా ఆడేవాడు. అతడు క్రీజులో ఉన్నాడంటే పరుగుల వరద పారాల్సిందే. 2011 ప్రపంచ కప్ సాధించిన భారత జట్టులో సెహ్వాగ్ కూడా భాగస్వామిగా ఉన్నాడు. ఈ ఏడాది రంజీ ట్రోఫీ సీజన్లో తన సొంత జట్టు ఢిల్లీని వదిలిపెట్టి హర్యానా జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.
అయితే, రంజీ ట్రోఫీలో సెహ్వాగ్ ఆడే అవకాశాలు కన్పిస్తున్నాయి. అంతేగాక, మాంచెస్టర్ ఛాంపియన్స్ లీగ్(ఎంఎసిల్)కు దుబాయ్‌లో సోమవారం సంతకం చేశాడు. ఈ టోర్నీలో రిటైరైన క్రికెటర్లు కూడా ఆడవచ్చు.