హైదరాబాద్: ఉప్పల్ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో సెంచరీ సాధించడం సంతోషంగా ఉందని వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ వృద్ధిమాన్ సాహా అన్నాడు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన సాహా భారత్ తరుపున 20కి పైగా టెస్టు మ్యాచ్‌లు ఆడటం అంటే అదొక అద్భుతమైన ఘనతేనని పేర్కొన్నాడు.
'టీమిండియా తరపున 20 నుంచి 22 టెస్టు మ్యాచ్‌లు ఆడటం అతి పెద్ద మైలురాయి. అది నాకే కాదు.. ఎవరికైనా గొప్ప ఘనతే' అని సాహా తెలిపాడు. 'సంజయ్ బంగర్ (బ్యాటింగ్ కోచ్) బ్యాటింగ్ చేసేటప్పుడు స్ట్రయిట్ బ్యాట్ ఆడమని సలహా ఇచ్చాడు. కోహ్లీతో కలిసి ఆడేటప్పుడు తన సహజసిద్ధమైన ఆటను ఆడే వీలు ఎక్కువగా ఉంటుంది' అని సాహా పేర్కొన్నాడు.

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్ సాహాకు 21వ టెస్టు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన సాహా తన బ్యాటింగ్ పై సంతృప్తి వ్యక్తం చేశాడు. ఇటీవలే ఇరానీ కప్ పైనల్‌లో వృద్ధిమాన్ సాహా డబుల్ సెంచరీ (203) అనంతరం బంగ్లాతో జరుగుతున్న ఏకైక టెస్టులో సెంచరీతో సాహా రాణించాడు.
ఇదిలా ఉంటే టెస్టు క్రికెట్ నుంచి మహేంద్ర సింగ్ ధోని వీడ్కోలు చేసిన తర్వాత వికెట్ కీపర్ స్ధానాన్ని వృద్ధిమాన్ సాహా భర్తీ చేశాడు. భారత టెస్టు జట్టులో రెగ్యులర్ కీపర్‌గా ఉన్న సాహా, ఇప్పటివరకూ తాను ఆడిన టెస్టు మ్యాచ్‌లను ఒక మైలురాయిగా అభివర్ణించాడు. బంగ్లాతో ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న ఏకైక టెస్టులో భారత్ తన తొలి ఇన్నింగ్స్‌ను 687 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది.