
దుబాయ్: ముంబై ఇండియన్స్ (ఎంఐ)పై సాధించిన విజయం కష్టంగా సాధించినదే అని ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) కెప్టెన్ రిషబ్ పంత్ పేర్కొన్నాడు. ఈ సీజన్‌లో మాకు దొరికిన ఆణిముత్యం అవేశ్ ఖాన్ అని తెలిపాడు. ఢిల్లీని గెలిపించడం అద్భుతంగా ఉందని ఢిల్లీ స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ అన్నాడు. శనివారం జరిగిన లో స్కోరింగ్ మ్యాచ్‌లో ఢిల్లీ 4 వికెట్ల తేడాతో ముంబైపై గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు 129 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (33; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్. లక్ష్య ఛేదనలో ఢిల్లీ కూడా తడబడ్డా.. ఆఖరి ఓవర్‌లో విజయం సాధించింది. 19.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది. మాజీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (33 నాటౌట్) చివరి వరకు అజేయంగా నిలిచి తన జట్టుకు విజయాన్ని అందించాడు.
మ్యాచ్ అనంతరం డీసీ కెప్టెన్ రిషబ్ పంత్ మాట్లాడుతూ... 'షార్జాలో ఎప్పుడు ఆడినా.. ఇతర పిచ్‌ల కన్నా వైవిధ్యంగా ఉంటుంది. ఈ విషయం అందరికి తెలుసు. అందుకే ఇది కష్టంగా సాధించిన విజయమే అనుకుంటా. అయితే ఈ మ్యాచ్‌లో మేం పవర్ ప్లేలో పూర్తిగా పేస్ బౌలింగే వేయించాలనుకున్నాం. ఎందుకంటే.. తర్వాత స్పిన్నర్లకు అనుకూలిస్తుందని భావించాం. ఈ క్రమంలోనే కీరన్ పొలార్డ్, హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ చేసేటప్పుడు రవిచంద్రన్ అశ్విన్‌కు చివర్లో ఒక ఓవర్ మిగిలి ఉంచాలని అనుకున్నా. వాళ్లని ఆఖర్లో కట్టడి చేయాలని ప్రణాళిక వేసుకున్నాం' అని అన్నాడు.

'ఈ సీజన్‌లో మాకు దొరికిన ఆణిముత్యం అవేశ్ ఖాన్. అతడు అద్భుతంగా బౌలింగ్ చేస్తూ.. కీలక వికెట్లు తీస్తున్నాడు. జట్టుకు బాగా ఉపయోగపడుతున్నాడు. బంతిని ఇచ్చిన ప్రతిసారి నిరూపించుకున్నాడు. ఇకపోతే ఛేదనలో నేనూ, శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ చేసేటప్పుడు చివరి వరకూ క్రీజులో ఉండాలనుకున్నాం. కానీ నేను ఔటైన విధానం తీవ్ర నిరాశకు గురిచేసింది. ఆ షాట్ నేను అనుకున్నట్లు వెళ్లలేదు. అయితే ఇవన్నీ ఆటలో భాగమే. ఎవరైనా ఒక బ్యాట్స్‌మెన్ పవర్ ప్లేలో వేగంగా ఆడాలి. ఈరోజు నేను ఆ బాధ్యత తీసుకోవాలనుకున్నా. కానీ త్వరగానే ఔట్ అయ్యా' అని డీసీ కెప్టెన్ రిషబ్ పంత్ చెప్పాడు.
'నా బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు జరిగినా.. అందుకు తగ్గట్టు సిద్ధమయ్యా. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా జట్టును గెలిపిస్తాననే నమ్మకం ఉంది. మనం సానుకూలంగా ఆలోచిస్తే.. అంతా మంచే జరుగుతుంది. ఈ క్రమంలోనే ఆర్ అశ్విన్ కూడా అదే ఆలోచనా విధానంతో బాగా ఆడాడు. సింగిల్స్ తీస్తూ స్ట్రైక్ రొటేట్ చేశాడు. మేమిద్దరం ఆఖరి వరకు క్రీజులో నిలవాలని అనుకున్నాం. అందుకు నాకు సహకరించాడు. మా జట్టు గత రెండేళ్లలో చాలా మారిపోయింది. 2019 నుంచి జట్టులోని పరిస్థితులు అనుకూలంగా మారాయి. లీగ్ దశలో ప్రతి పాయింట్ కూడా ముఖ్యమే. ఎందుకంటే.. టాప్ రెండు జట్లలో నిలిస్తే ప్లే ఆఫ్స్‌లో ఒకటి గెలవగానే నేరుగా ఫైనల్స్ చేరే అవకాశం ఉంటుంది. అందుకోసమే లీగ్ స్టేజ్‌లో ప్రతి మ్యాచ్ గెలవడానికి ప్రయత్నిస్తాం' అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.