
ముంబై: భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ పదవికి మాజీ సారథి రాహుల్ ద్రవిడ్ దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉన్న హెడ్ కోచ్ రవిశాస్త్రి పదవీకాలం టీ20 ప్రపంచకప్ 2021తో ముగియనుంది. నవంబర్ 14న శాస్త్రి తన పదవి నుంచి తప్పుకోనున్నాడు. రవిశాస్త్రి స్థానంలో రాహుల్ నియామకం లాంఛనమే. ఈ క్రమంలో టీమిండియాను విజయవంతంగా నడిపేందుకు బ్లూప్రింట్‌తో ద్రవిడ్ వస్తాడని మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా అన్నాడు. ద్రవిడ్ కోచ్ పదవి చేపడితే దీర్ఘకాలం జట్టు విజయం కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తాడని ఆకాష్ పేర్కొన్నాడు.
టీ20 ప్రపంచకప్ అనంతరం ప్రస్తుత హెడ్ కోచ్ రవిశాస్త్రి పదవి బాధ్యతలు ముగియనున్న నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఇటీవల దరఖాస్తులను ఆహ్వానించిన విషయం తెలిసిందే. హెడ్ కోచ్ పదవితో పాటు, బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్ పదవులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్నవారు అక్టోబర్ 26లోగా అప్లికేషన్లు సమర్పించారు. అయితే టీమిండియా హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు చేసుకోవాలని ద్రవిడ్‌ను బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ, సెక్రటరీ జైషా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసిట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ముందుగా వీరి విన్నపానికి ససేమిరా అన్న ద్రవిడ్.. దాదా రిక్వెస్ట్‌కు ఒకే చెప్పాడట. అప్లికేషన్‌కు చివరి రోజు ది వాల్ దరఖాస్తు చేసుకున్నట్లు బోర్డు వర్గాలు తెలిపాయి. ఇక కోచ్ నియామక రేసులో ద్రవిడ్ ఉండటంతో మిగతావారికి నిరాశే ఎదురుకానుంది.
తాజాగా ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ షోలో మాట్లాడుతూ... 'టీమిండియా కోసం రాహుల్ ద్రవిడ్ ఒక ప్రాసెస్‌ను ప్రవేశపెడతాడు. ద్రవిడ్ ఎంపికైతే.. ఐదేళ్లకు గానూ బ్లూ ప్రింట్‌ను సిద్ధం చేసుకుని వస్తాడు. స్వల్ప వ్యవధి కోసం కాకుండా ఐదేళ్ల నుంచి పదేళ్ల దీర్ఘకాలిక ప్రణాళికలతో రావొచ్చు' అని అన్నాడు. జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) ఛైర్మన్‌గా, అండర్-19 జట్టు కోచ్‌గా ఇప్పటికే ద్రవిడ్ ప్రశంసలు అందుకున్నాడు. మరోవైపు దిగ్గజ బ్యాట్స్‌మన్, హైదరాబాద్ సొగసరి వీవీఎస్ లక్ష్మణ్ ఎన్‌సీఏ బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ద్రవిడ్ స్థానంలో లక్ష్మణ్ ఈ బాధ్యతలు చేపట్టాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో రాహుల్ ద్రవిడ్ కాంబినేషన్ చాలా ఆసక్తిగా ఉంటుందని ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. 'త్వరలోనే టీ20 ఫార్మాట్‌లో రోహిత్ శర్మ-రాహుల్ ద్రవిడ్, టెస్టు క్రికెట్‌లో విరాట్ కోహ్లీతో జట్టు కట్టడం చూడబోతున్నాం. ఇది చాలా ఉత్తేజభరితంగా ఉండబోతుంది. అధికారికంగా ద్రవిడ్ దరఖాస్తు చేసుకున్నాడు. కాబట్టి ఇతర దరఖాస్తులను బీసీసీఐ పరిగణనలోకి తీసుకుంటుందని అనుకోవడం లేదు. ద్రవిడ్ రాకకోసం నేను మాత్రమే కాదు అందరూ ఎదురుచూస్తున్నారు' అని ఆకాశ్ చోప్రా చెప్పాడు.
ఇప్పటికే అనేక మంది యువ ఆటగాళ్లు అండర్-19 స్థాయిలో రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలోనే మేటి ఆటగాళ్లుగా తయారైన సంగతి తెలిసిందే. కొందరు ప్లేయర్స్ ఇప్పుడు భారత జట్టులోనూ ఆడన్నారు. టీ20 ప్రపంచకప్ 2021 తర్వాత ప్రస్తుత కోచ్ రవిశాస్త్రి కాంట్రాక్ట్ ముగుస్తున్న నేపథ్యంలో చాలా మంది ద్రవిడ్‌నే తర్వాతి కోచ్‌గా నియమించాలంటూ అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలోనే సౌరవ్ గంగూలీ, జై షా అతడిని ఒప్పించారని సమాచారం. మరోవైపు ద్రవిడ్ ఇటీవల శ్రీలంక పర్యటనలోనూ భారత జట్టు కోచ్‌గా సేవలందించిన సంగతి తెలిసిందే. గతంలో ఇండియా-ఏ జట్టుకు, శ్రీలంకలో పర్యటించిన టీమిండియాకు ద్రవిడ్ కోచ్‌గా వ్యవహరించాడు.