
ఆక్లాండ్: చాన్నాళ్ల తర్వాత న్యూజిలాండ్ గడ్డపై భారత్ మూడు ఫార్మాట్‌లలో సిరీస్‌లు ఆడనుంది. ఈ సుదీర్ఘ టూర్‌లో భాగంగా న్యూజిలాండ్-భారత్ జట్ల మధ్య ఐదు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు జరుగనున్నాయి. పరుగుల వరద పారే ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్‌లో శుక్రవారం తొలి టీ20తో సిరీస్ ప్రారంభం కానుంది. మ్యాచ్ మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ పైచేయి సాధిస్తుందని ఆస్ట్రేలియా మాజీ బ్యాట్స్‌మన్ డీన్ జోన్స్ జోస్యం చెప్పాడు. కివీస్‌ను కోహ్లీసేన చిత్తుచిత్తుగా ఓడిస్తుందన్నాడు.
గురువారం డీన్ జోన్స్ ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ చేసాడు. 'భారత్-న్యూజిలాండ్ తొలి టీ20 మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. కివీస్‌ను భారత్ చిత్తుచిత్తుగా ఓడిస్తుంది. మ్యాచ్, సిరీస్ రసవత్తరంగా సాగనుంది. తొలి టీ20 మ్యాచ్ అనంతరం స్కాట్ స్టైరిస్, మైక్ హెసన్ చెప్పే సాకుల కోసం వేచిచూస్తున్నా' అని డీన్ జోన్స్ తన ట్విట్టర్ ఖాతాలో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ట్వీట్ చూసిన టీమిండియా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఏడాదే మెగా టోర్నీ టీ20 ప్రపంచకప్ ఉండటంతో న్యూజిలాండ్-భారత్ జట్లు ఈ సిరీస్‌ను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. మరోవైపు ప్రపంచకప్‌నకు ముందు ప్రయోగాలు చేసేందుకు ఈ సిరీస్‌ను వేదికగా చేసుకున్నాయి. అయితే సొంతగడ్డపై బలమైన జట్టుగా ముద్రపడ్డ న్యూజిలాండ్.. ఇటీవల ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 0-3తో కోల్పోయి ఆత్మవిశ్వాసం లోపించినట్లు కనిపిస్తోంది. ఈ ఓటమితో కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ నాయకత్వంపై కూడా విమర్శలు వచ్చాయి. మరోవైపు విరాట్ కోహ్లీ మాత్రం విజయాలపై నమ్మకంగా ఉన్నాడు.
గత ఏడాది కివీస్ పర్యటనలో భారత్ వన్డే సిరీస్‌ను 4-1తేడాతో కైవసం చేసుకోగా.. టీ20 సిరీస్‌ను 1-2తో కోల్పోయిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు కివీస్‌తో భారత్ 11 టీ20ల్లో తలపడగా.. కేవలం మూడు మ్యాచుల్లోనే విజయం సాధించింది. ఇరు జట్ల మధ్య చివరిసారిగా 2019, ఫిబ్రవరిలో హామిల్టన్ వేదికగా జరిగిన టీ20 మ్యాచ్‌లో టీమిండియా 4 పరుగుల తేడాతో ఓడిపోయింది.
ఈడెన్ పార్క్ మైదానం పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలం. చిన్న బౌండరీలు కావడంతో పరుగుల వరద ఖాయం. ఇటీవల కివీస్-ఇంగ్లండ్ సిరీస్‌లో కూడా భారీగా పరుగులు నమోదయ్యాయి. వాతావరణంతో మాత్రం సమస్యగానే ఉంది. శుక్రవారం వర్షం కురిసే అవకాశం ఉంది. పూర్తిగా కాకపోయినా ఏదో ఒక దశలో అంతరాయం కలిగించవచ్చు.