హరారే: తొలి ట్వంటీ 20లో భారత్ పైన జింబాబ్వే అనూహ్య విజయం సాధించింది. టీమిండియా 2 పరుగుల తేడాతో ఓడింది. చివరి ఓవర్లో గెలుపుకు 8 పరుగులు రావాల్సి ఉంది. క్రీజులో మ్యాచ్ ఫినిషర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ధోనీ ఉన్నాడు. కానీ, పరుగులు సాధించలేకపోయాడు.
దీంతో జట్టు పైన విమర్శలు కూడా వచ్చాయి. కాగా మ్యాచ్ ఓటమి పైన భారత్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ స్పందించాడు. ఆఖరి బంతికి తాము నాలుగు పరుగులు చేయాల్సి ఉందన్న విషయాన్ని గుర్తు చేసిన ధోనీ.. నేవిల్లీ మడ్జీవా వేసిన ఆఖరి బంతి అద్భుతమని, ఆఫ్ స్టంప్‌కు ఆవల వెళుతున్న ఆ తరహా బంతిని బౌండరీకి పంపాలంటే చాలా కష్టమని చెప్పాడు.
ఆ బంతిని ధోనీ అటెంప్ట్ చేయగా, కేవలం ఒక్క పరుగు మాత్రమే వచ్చింది. తాము సామర్థ్యానికి తగినట్లుగానే ఆడామని, గెలుపు, ఓటములను ముందుగానే ఊహించలేమని చెప్పాడు. ట్వంటీ 20లో విజేతలుగా నిలవడం అంత సులువేమీ కాదన్నాడు. ఒత్తిడి మధ్య ఆఖరి బంతిని అద్భుతంగా వేసిన మడ్జీవాకు మంచి భవిష్యత్తు ఉందన్నాడు.

చివరి ఓవర్లో ధోనీ ఇలా..
చివరి ఓవర్లో విజయానికి కేవలం ఎనిమిది పరుగులే అవసరమయ్యాయి. కానీ మడ్జీవా చక్కని బౌలింగ్‌కు తోడు, పేలవ బ్యాటింగ్‌తో భారత్ ఓటమి కొని తెచ్చుకుంది. మడ్జీవా చివరి ఓవర్లో... తొలి బంతికి ధోని సింగిల్ తీశాడు. రెండో బంతికి అక్షర్ పటేల్ ఔటయ్యాడు. ధోని స్ట్రైకింగ్‌కు వచ్చాడు.
ఈ దశలో ధోని చెలరేగుతాడని అభిమానులు భావించారు. కానీ కానీ అతడు మూడో బంతికి సింగిల్ తీసి అరంగేట్ర ఆటగాడు రిషి ధావన్‌కు బ్యాటింగ్ ఇచ్చాడు. బంతిని సరిగా చూసుకోకుండా అడ్డదిడ్డంగా ఆడేందుకు ప్రయత్నించిన రిషి బంతులను వృథా చేశాడు.
మడ్జీవా నాలుగో బంతి యార్కర్ వేశాడు. రిషి బ్యాట్ కూడా తాకించలేకపోయాడు. తర్వాతి బంతిని మడ్జీవా రిషికి అందేలానే వేసినా.. అంపైర్ వైడ్ ఇవ్వడంతో సమీకరణం రెండు బంతుల్లో ఐదుకు మారింది. ఐదో బంతికి రిషి సింగిల్ తీయడంతో చివరి బంతికి నాలుగు పరుగులు అవసరమయ్యాయి.
ధోని స్ట్రైకింగ్‌కు వచ్చాడు. కానీ మడ్జీవా అతడికి ఎలాంటి అవకాశమూ ఇవ్వలేదు. ఆఫ్‌స్టంప్ ఆవల అతడు వేసిన బంతి ధోనీకి సరిగా అందలేదు. పాయింట్ దిశగా నేరుగా ఫీల్డర్ వద్దకే కొట్టి సింగిల్‌కే పరిమితమయ్యాడు కెప్టెన్ ధోనీ.