
హైదరాబాద్: అనుష్క శర్మ ప్రతినిధి ఏమీ లేదు అంతా ఒట్టిదే అని కొట్టి పడేశాడు. కానీ, ఒకటి కాదు రెండు కాదు వరుసగా వస్తున్న రూమర్లు నిజమేనన్నట్లుగా అనిపించాయి. చివరికి అవే నిజమైయ్యాయి. ఇటలీకి వెళ్లిన ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరిగిన అత్యంత కోలాహలంగా ఆనందోత్సాహాలతో జరిగింది.
షాంపూ కలిపింది ఇద్దరినీ..:
2013లో విరాట్, అనుష్క ఒక షాంపూ యాడ్‌లో కలిశారు. అప్పుడే ఎదుగుతున్న కోహ్లీ , బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ అనుష్క కలిసి చేసిన మొదటి వాణిజ్య ప్రకటనతో వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. తర్వాత స్నేహం మొదలైంది. అభిరుచులు కలిసి ప్రేమ కూడా చిగురించింది. కొన్ని నెలల్లోనే ఇద్దరూ దగ్గరయ్యారు.
2014 లో ప్రేమ పట్టాలెక్కింది..
దక్షిణాఫ్రికా పర్యటన 2014 జనవరిలో ముగించుకుని స్వదేశానికి వచ్చిన కోహ్లి.. నేరుగా విమానాశ్రయం నుంచి ముంబయిలోని అనుష్క అపార్ట్‌మెంట్‌కు వెళ్లాడు. దీంతో వీరిద్దరి ఏదో నడుస్తోందన్న సందేహాలు మొదలయ్యాయి. ఆ తర్వాతి నెలలో భారత జట్టు న్యూజిలాండ్‌లో సిరీస్ ఆడుతుండగా.. విరామ సమయంలో కోహ్లి, అనుష్క కలిసి చెట్టాపట్టాలేసుకు తిరుగుతున్న ఫొటోలు బయటికి రావడంతో సందేహాలు మరింత బలపడ్డాయి. అదే ఏడాది ఇంగ్లాండ్ పర్యటనకు అనుష్కను వెంట తీసుకెళ్లాడు కోహ్లి. 2014 అక్టోబర్లో ఐఎస్‌ఎల్ ఫుట్‌బాల్ మ్యాచ్ సందర్భంగా ప్రేమ పక్షులు స్టేడియంలోని స్టాండ్స్‌లో కలిసి కనిపించాయి. తర్వాతి నెలలో శ్రీలంకతో జరిగిన ఓ వన్డే మ్యాచ్‌కు అనుష్క హాజరైంది. విరాట్ సెంచరీ పూర్తి చేసి.. స్టాండ్స్‌లో ఉన్న అనుష్కకు గాలి ముద్దు పంపడంతో వీరి ప్రేమ బహిర్గతమైంది.
అసలు గొడవ ఇలా :
అనుష్కను పెళ్లి విషయంలో కోహ్లి తొందరపెట్టడం వల్లే ఇద్దరి మధ్య దూరం పెరిగిందని కొందరి వాదన. మరి కొందరు ఒక ఫొటో షూట్ విషయంలో అనుష్కపై విరాట్ ఆగ్రహించడంతోనే విడిపోయారని.
ప్రేమ ముందు అహం ఓడిపోయింది.
భారత్ స్టార్ క్రికెటర్ కోహ్లి, బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న అనుష్క.. ఇద్దరూ తమ తమ రంగాల్లో టాప్‌లో ఉన్నవాళ్లే. అయినా వాళ్లు అహాలు (ఇగో) పట్టించుకోలేదు. ప్రేమ ముందు తలొంచారు. మధ్యలో వచ్చిన ఎడబాటుకు ఇద్దరి మధ్య మరింత బంధం పెరిగింది.
దాచిపెట్టకుండా తేల్చి చెప్పిన కోహ్లీ:
2014 అక్టోబరు నెలలో జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో మీడియాతో మాట్లాడుతూ తమ ప్రేమ సంగతిని అధికారికంగా ప్రకటించాడు కోహ్లీ. 2015లో వీరి బంధం మరింత బలపడింది. ఇక పెళ్లే అనుకుంటుండగా.. ఆ ఏడాది చివర్లో ఇద్దరి మధ్య విభేదాలు మొదలైయ్యాయి. ఒకరినొకరు సామాజిక మాధ్యమాల్లో అనుసరించడం కూడా ఆపేయడంతో ఈ విషయం నిజమని తేలిపోయింది. కొన్ని నెలల పాటు ఇద్దరూ కలిసి కనిపించలేదు. ఐతే యువీ పెళ్లిలో విరుష్క జోడీ కలిసి సందడి చేయడంతో మళ్లీ ఒకటయ్యారని తేలింది.
2016 డిసెంబరు నెలలో యువరాజ్ సింగ్ పెళ్లి జరిగింది. వారి పెళ్లి విందుకు భారత క్రికెటర్లు చాలామంది హాజరయ్యారు. ఐతే ఆ విందులో యువరాజ్, అతడి భార్య హేజెల్ కీచ్ కంటే కూడా ఇంకో జోడీ ఎక్కువమంది దృష్టిని ఆకర్షించింది, ఆ జంటే విరాట్ కోహ్లీ , అనుష్కలు. రెండేళ్లు గాఢమైన ప్రేమలో ఉన్న ఇద్దరు చిన్న చిన్న మనస్పర్థలతో కొన్నాళ్లు దూరమైయ్యారు. అయితే కొన్ని నెలలకే ఒకరినొకరు మళ్లీ కలుసుకున్నారు. వారిని ఆ దూరం మరింత దగ్గర చేసింది. ఏడాది తిరిగేసరికి వివాహ బంధంతో దంపతులయ్యారు.
విరుష్క వివాహ వేడుక:
మిలాన్ (ఇటలీ)లోని టుస్కానీలో ఓ ఖరీదైన రిసార్టులో అత్యంత వైభవంగా ఈ వేడుక జరిగింది. పూర్తి ప్రైవేట్ కార్యక్రమంగా జరిగిన ఈ వేడుకకు ఇరువురి కుటుంబ సభ్యులు, సన్నిహితులు, కొద్ది మంది స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. పూర్తిగా పంజాబీ సాంప్రదాయ పద్ధతిలో ఈ పెళ్లి జరిగింది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సబ్యసాచీ ముఖర్జీ డిజైన్ చేసిన పింక్ లెహంగాలో అనుష్క సిగ్గుల మొగ్గ అయిపోగా.. సంప్రదాయ షేర్వాణిలో విరాట్ మెరిసిపోయాడు. పెండ్లి తంతు ముగిసిన తర్వాత విరుష్క జంట.. తమ ప్రేమ బంధానికి అక్షర రూపమిచ్చింది. వారి ప్రేమ అలానే జీవితాంతం కొనసాగాలని పరస్పరం వాగ్దానం చేసుకున్నారు. ఈ విషయాన్ని అభిమానులతో పంచుకోవడమే నిజమైన అశీర్వాదమంటూ మురిసిపోయారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.