నడిపించే బాధ్యత తీసుకుంటానని రోహిత్‌కు చెప్పేశా
"టాప్-3లో రోహిత్ శర్మ సహాయక పాత్ర పోషించడం చాలా అరుదు. సాధారణంగా నేను ఆ పని చేస్తుంటా. ఈ రోజు నేను నడిపించే బాధ్యత తీసుకుంటానని రోహిత్‌కు చెప్పేశాను. నేను ఔటయ్యాక అతనూ అదే పని చేశాడు. రోహిత్‌తో కలిసి ఆడటం చాలా బాగుంటుంది. ఇది మా ఐదో డబుల్ సెంచరీ భాగస్వామ్యం" అని కోహ్లీ చెప్పాడు.

మరికొన్నేళ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి
"ఆటను ఆస్వాదించేందుకు నా కెరీర్‌లో మరికొన్నేళ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. దేశం తరఫున ఆడటం గర్వకారణం కాబట్టి ఏ మ్యాచ్‌ను కూడా తక్కువగా చూడరాదు. ఆటను తేలికగా తీసుకోను. నా వంతు మైదానంలో మెరుగైన ప్రదర్శన ఉండేలా జాగ్రత్త పడతాను. ఇక జట్టు బాధ్యత కూడా నాదే కాబట్టి నేను మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కొన్ని సార్లు ఒత్తిడి ఎదురవుతుంది. దాన్ని అధిగమించి నా పని నేను చేసుకుంటూ పోవాలి. మనం ఎంత కష్టపడి ఆడతామో ఆ కష్టం.. విజయం, ప్రశంసల రూపంలో మనకు తిరిగి వస్తుంది" అని విరాట్ కోహ్లీ వెల్లడించాడు. కాగా, తొలి వన్డేలో విరాట్ కోహ్లీ-రోహిత్ శర్మల జోడీ రెండో వికెట్‌కు 246 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే.

323 పరుగుల విజయ లక్ష్యాన్ని 42.1 ఓవర్లలోనే
వెస్టిండిస్ నిర్దేశించిన 323 పరుగుల విజయ లక్ష్యాన్ని 42.1 ఓవర్లలోనే ఛేదించింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ శిఖర్ ధావన్(4) రెండో ఓవర్‌లోనే పెవిలియన్ చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కోహ్లీ.. రోహిత్ అందించిన సహకారంతో చెలరేగిపోయాడు. ఇద్దరూ కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు.

సెంచరీలు మోత మోగించిన రోహిత్, కోహ్లీ
ఒకవైపు రోహిత్ శర్మ కుదురుగా బ్యాటింగ్ చేస్తే, కోహ్లీ మాత్రం బౌండరీల మోత మోగించాడు. దీంతో భారత్ 10 ఓవర్లలోనే 71 పరుగులు చేసింది. అనంతరం తనదైన శైలిలో మెరుపులు మెరిపించిన కోహ్లీ 88 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో కోహ్లీకి ఇది 36వ సెంచరీ. ఆ తర్వాత కాసేపటికే రోహిత్ శర్మ కూడా కెరీర్‌లో 20వ సెంచరీ నమోదు చేశాడు.

కోహ్లీ, రోహిత్‌లు కలిసి నాలుగుసార్లు సెంచరీలు నమోదు
84 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్లతో 100 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ ఇద్దరు కలిసి నాలుగుసార్లు సెంచరీలు నమోదు చేయడం గమనార్హం. తద్వారా భారత్ తరపున గంగూలీ, టెండూల్కర్‌ల పేరిట ఉన్న ఈ రికార్డును సమం చేశారు. ఈ క్రమంలో కోహ్లీ140 పరుగుల వద్ద బిషూ బౌలింగ్‌లో స్టంపౌట్ కావడంతో రెండో వికెట్‌కు నమోదైన 246 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.

తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 322/8
కోహ్లీ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన అంబటి రాయుడు (22 నాటౌట్) రోహిత్‌కు అండగా నిలవడంతో భారత్ 42.1 ఓవర్లలోనే విజయాన్నందుకుంది. వెస్టిండిస్ బౌలర్లలో బిషూ, థోమస్‌లు తలో వికెట్ తీసుకున్నారు. అంతకుముందు టాస్ తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 322 పరుగులు చేసింది.


Click it and Unblock the Notifications












