రాజ్ కోట్: మహేంద్ర సింగ్ ధోనీకి బౌలింగ్ తనకు పెద్ద సవాల్ అని రవీంద్ర జడెజా అన్నాడు. ఇన్నేళ్లు ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో జడెజా ఉన్నాడు. చెన్నై, రాజస్థాన్‌ల పైన వేటు నేథ్యంలో ఆ జట్ల స్థానంలో పుణే, రాజ్ కోట్ కొత్త జట్లు వచ్చాయి.
వచ్చే ఐపిఎల్‌లో ధోనీ పుణే తరఫున, జడెజా రాజ్ కోట్ తరఫున ఆడుతున్నారు. ఈ నేపథ్యంలో.. జడెజా స్పందించాడు. కొన్నేళ్లుగా ఐపీఎల్‌లో ధోనికి సహచరుడిగా ఉంటూ ఇప్పుడు ప్రత్యర్థిగా మారిపోవడం కొత్తగా అనిపిస్తోందన్నాడు.

ధోనికి బౌలింగ్ చేయడం మామూలుగానే సవాల్ అన్నాడు. ఇక ట్వంటీ 20లో మరీ కష్టమని చెప్పాడు. ధోని ఈ ఫార్మాట్లో అత్యుత్తమ ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్నాడని, అయితే తన అత్యుత్తమ ప్రదర్శన చేయడానికి ప్రయత్నిస్తానన్నాడు.
సొంతగడ్డ రాజ్‌కోట్‌లో ఫ్రాంఛైజీ ఏర్పాటు కావడం, తాను ఆ ఫ్రాంఛైజీకే ప్రాతినిధ్యం వహించబోతుండటం గొప్ప అనుభూతి కలిగిస్తోందన్నాడు. సొంత మైదానంలో ఫ్రాంఛైజీ తరఫున ఆడబోతుండటాన్ని మాటల్లో వర్ణించలేనని, వచ్చే ఐపీఎల్‌లో బాగా ఆడగలనని ధీమా వ్యక్తం చేశాడు.