'క్రికెట్ ఆడటం మొదలు పెట్టినప్పట్నుంచి.. మొత్తం ప్రయాణం కళ్లముందు గిర్రున తిరిగింది'

ముంబై: భారత జట్టుకు ఎంపికవడం చాలా సంతోషంగా ఉందని టీమిండియా యువ క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్ అన్నాడు. విషయం తెలిసినప్పటి నుంచి ఎంతో భావోద్వేగానికి గురయ్యానని, క్రికెట్ ఆడటం మొదలు పెట్టినప్పట్నుంచి మొత్తం ప్రయాణం కళ్లముందు గిర్రున తిరిగిందన్నాడు. ప్రయాణంలో అండగా నిలిచిన తల్లిదండ్రులు, స్నేహితులు, కోచ్‌లు తనకు గుర్తొచ్చారని రుతురాజ్ చెప్పాడు. పరిస్థితులు, వాతావరణానికి త్వరగా అలవాటు పడటం తన బలంగా పేర్కొన్నాడు. శ్రీలంక పర్యటనలో రాణించి అందరినీ ఆకట్టుకుంటానని చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు రుతురాజ్ ధీమా వ్యక్తం చేశాడు.

భావోద్వేగానికి గురయ్యా:
టీమిండియాకు తొలిసారి ఎంపికైన సందర్భంగా రుతురాజ్ గైక్వాడ్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడాడు. 'టీమిండియాకు ఎంపికైన విషయం తెలిసినప్పటి నుంచి ఎంతో సంతోషంగా ఉంది. క్రికెట్ ఆడటం మొదలు పెట్టినప్పట్నుంచి మొత్తం ప్రయాణం కళ్లముందు గిర్రున తిరిగింది. ఎంతో భావోద్వేగానికి గురయ్యాను. ఈ ప్రయాణంలో అండగా నిలిచిన తల్లిదండ్రులు, స్నేహితులు, కోచ్‌లు నాకు గుర్తొచ్చారు. భారత జట్టుకు ఎంపికవ్వడంతో వారంతా ఆనందించారు' అని రుతురాజ్ తెలిపాడు. 59 లిస్ట్-ఏ మ్యాచుల్లో 47+ సగటు, 130 టీ20ల్లో 130 స్ట్రైక్‌రేట్‌తో రుతురాజ్ పరుగులు చేశాడు. ఐపీఎల్ 2020, 2021లో ఆకట్టుకున్న విషయం తెలిసిందే.

రాహుల్ సర్‌తో కలుస్తున్నందుకు సంతోషం:
ఎలాంటి పరిస్థితులకైనా త్వరగా అలవాటు పడటం తన బలమని రుతురాజ్ గైక్వాడ్ తెలిపాడు. అవసరమైతే దూకుడుగా, నిలకడగా ఆడటం తన బలమని పేర్కొన్నాడు. తిరిగి రాహుల్ ద్రవిడ్‌తో కలవడం ఆనందంగా ఉందన్నాడు. 'అవకాశాలు పరిమితంగా ఉంటాయి. ఈ ప్రయాణం నుంచి వీలైనంత నేర్చుకుంటాను. మళ్లీ రాహుల్ సర్‌తో కలుస్తున్నందుకు సంతోషంగా ఉంది. భారత్-ఏ జట్టు విదేశాల్లో పర్యటించి ఏడాదిన్నర గడిచింది. మళ్లీ ఆయనతో కలిసేందుకు, మాట్లాడేందుకు, నేర్చుకొనేందుకు ఇదో సువర్ణావకాశం' అని రుతురాజ్ పేర్కొన్నాడు.

సిగ్గు ఎక్కువని ధోనీకి తెలుసు:
టీమిండియాకు ఎంపికవ్వడానికి ముందు రుతురాజ్ గైక్వాడ్ దేశవాళీ క్రికెట్లో మహారాష్ట్రకు ఆడాడు. ఇక ఐపీఎల్‌లో చెన్నై తరఫున అదరగొట్టాడు. 'మహీ భాయ్ ఏం మాట్లాడినా ఆకట్టుకుంటుంది. మ్యాచులు ముగిశాక ఆయన నా గురించి మీడియాతో మాట్లాడటం విన్నాను. మహీతో నేను ఎక్కువగా మాట్లాడను. నాకు సిగ్గు ఎక్కువని ఆయనకు తెలుసు. అందుకే ఒత్తిడిగా ఉంటే.. మహీ భాయ్ నా వద్దకు సముదాయిస్తారు. గతేడాది ఐపీఎల్‌ను గొప్పగా ఆరంభించలేదు. ఆటను ఆస్వాదించాలని, ఆందోళన పడొద్దని చెప్పారు. అవసరమైనప్పుడు క్రికెట్, జీవిత సలహాలు ఇస్తుంటారు. దేశవాళీ క్రికెట్లో కేదార్ జాదవ్ నన్ను ప్రోత్సహించారు; అని రుతురాజ్ చెప్పుకొచ్చాడు.

రెండేళ్లుగా నిలకడైన ప్రదర్శన:
మహారాష్ట్రకు చెందిన రుతురాజ్ గైక్వాడ్ ఐపీఎల్ 2020 ద్వారా అరంగేట్రం చేశాడు. ఆరంభంలో కరోనా బారిన పడి జట్టుకు దూరమైన అతను వచ్చిన అవకాశాలను సరిగ్గా వినియోగించుకోలేకపోయాడు. కానీ సీజన్ ఎండింగ్‌తో దుమ్ములేపాడు. వరుసగా మూడు హాఫ్ సెంచరీలు బాది తన సత్తా ఏంటో తెలియజేశాడు. తాజా సీజన్‌లోనూ గైక్వాడ్ అదే జోరును కొనసాగించాడు. ఫాఫ్ డూప్లెసిస్‌తో కలిసి విలువైన భాగస్వామ్యాలు అందించాడు. ఈ సీజన్‌లో మొత్తం 7 మ్యాచ్‌లు ఆడిన రుతురాజ్.. 128.94 స్ట్రైక్‌రేట్‌తో 196 రన్స్ చేశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 75 పరుగులు చేశాడు. గత రెండేళ్లుగా భారత్-ఏ తరఫున కూడా నిలకడగా రాణిస్తున్నాడు. అందుకే జాతీయ జట్టులో చోటు దక్కింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications