భారత్ న్యూజిలాండ్ తో ఆడిన టెస్టులన్నీ ఓడిపోయింది. ఈ మూడు టెస్ట్ ల్లో ఇండియా ఓడిపోవడానికి ప్రధాన కారణం.. నిలకడగా బ్యాటింగ్ చేసే బ్యాట్స్ మెన్ లేకపోవడం. డిఫెండబుల్ బ్యాట్స్ మెన్ జట్టులోని లేని సందర్భంలో ఇండియా ఆస్ట్రేలియాతో పర్యటనకు వెళ్లింది. ప్రస్తుతం జట్టులో ద్రవిడ్, పుజారా లాంటి ఆటగాళ్లు లేరు. దీంతో ఇండియా ఆట తీరు ఎలా ఉంటుందో అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. పుజారాను జట్టులోకి తీసుకునే అవకాశం ఉన్నా సెలక్టర్లు ఎంపిక చేయలేదు.
ప్రస్తుతం పుజారా ఫామ్ లేమితో బాధపడుతుండడంతో ఎంపిక చేయనట్లు తెలిసింది. అయితే 2018-19, 2020-21 సిరీస్‌లలో పుజారా ఆస్ట్రేలియా బౌలర్లకు పరీక్ష పెట్టాడు. పాట్ కమిన్స్, జోష్ హేజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్ బంతులను ఎదుర్కొన్నాడు. శరీరానికి దెబ్బలు తగిలినా మొండిగా ఆడాడు. 2018-19లో 74.42 సగటుతో 521 పరుగులతో సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా పుజారా నిలిచాడు. అప్పుడు టీమిండియా సిరీస్ గెలిచింది. 2020-21 పర్యటనలో పుజారా ఏకంగా 928 బంతులను ఆడాడు.

జట్టులో ఛటేశ్వర్ పుజారా లేకపోవడంపై ఆస్ట్రేలియా బౌలర్ స్పందించాడు. ఇది సంతోషకరమైన వార్త అని హేజిల్‌వుడ్ అన్నాడు. పుజారా క్రీజులో ఎక్కువ సమయం గడిపి బౌలర్లను అలసిపోయేలా చేస్తాడని అతను అభిప్రాయపడ్డాడు. పుజారాను ఎంపిక చేయాలని కొంత మంది డిమాండ్ చేస్తున్నారు. అయితే 2020 నుండి పుజారా ఫామ్ కోల్పోతూ వస్తున్నాడు. గత నాలుగేళ్లలో ఈ వెటరన్ ప్లేయర్ 28 టెస్టు మ్యాచ్ లు ఆడితే యావరేజ్ 30 కంటే తక్కువగానే ఉంది.
పుజారా ఒకసారి మాత్రమే మూడంకెల స్కోర్ చేశాడు. దీంతో అతన్ని ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేయలేదు. పుజారా లేని లోటు శుభ్ మన్ గిల్ తీరుస్తారని భావిస్తున్నారు. మొదటి టెస్ట్ కు అతను దూరమయ్యాడు. తొలి టెస్ట్ కు ముందు భారత ఆటగాళ్ల గాయాల బారిన పడడం ఆందోళన కలిగిస్తోంది. మొదటి టెస్ట్ లో భారత్ బుమ్రా నాయకత్వంలో బరిలోకి దిగుతోంది.