
హైదరాబాద్: శామ్ కుర్రన్... ఎడ్జ్‌బాస్టన్ వేదికగా భారత్‌తో తొలి టెస్టు ముగిసిన అనంతరం ప్రముఖంగా వినిపిస్తోన్న పేరు. ఇంగ్లాండ్‌కు చెందిన ఈ యువ ఆటగాడు రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి ఐదు వికెట్లు తీశాడు. అంతేకాదు రెండో ఇన్నింగ్స్‌లో 65 బంతుల్లోనే 63 పరుగులతో రాణించి ఇంగ్లాండ్‌కు గౌరవప్రదమైన స్కోరుని అందించాడు.
కెరీర్లో ఆడిన రెండో టెస్టులోనే శామ్ కుర్రాన్ అసాధారణ ఆటతీరు కనబరిచాడు. శామ్ కర్రన్ ఎవరో కాదు 1983లో జింబాబ్వేను గెలిపించేందుకు శాయశక్తులా ప్రయత్నించిన కెవిన్ కర్రన్ చిన్న కుమారుడే ఈ శామ్ కర్రన్. తాజా విజయంతో భారత్‌పై తన తండ్రి పగకు ప్రతీకారం తీర్చుకున్నాడు.
1983 వరల్డ్ కప్‌లో భాగంగా గ్రూప్-బిలో జింబాబ్వే, భారత్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌కి ముందు గ్రూప్‌లో వెస్టిండీస్ తొలిస్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా రెండోస్థానంలో, భారత్ మూడో స్థానంలో ఉంది. గ్రూప్ దశను దాటాలంటే ఈ మ్యాచ్‌లో గెలవడం కీలకం. ఈ మ్యాచ్‌లో భారత్ 17 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది.
దీంతో భారత్ ఓడిపోతుందని అంతా భావించారు. 9 పరుగులకే నాలుగు వికెట్లు పడిన దశలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కపిల్ దేవ్ ప్రత్యర్థి బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొని పరుగుల వరద పారించాడు. ఒకవైపు వికెట్లు పడుతుండటంతో భారత్ 140 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది.
చివర్లో క్రీజులోకి వచ్చిన సయ్యద్ కిర్మాణీ (24 నాటౌట్) మద్దతుగా నిలవడంతో నిర్ణీత 60 ఓవర్లలో భారత్ 8 వికెట్లు కోల్పోయి 266 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో 175 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన కపిల్ క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే 235 పరుగులకే ఆలౌటైంది.
ఈ విజయం తర్వాత ఆసీస్‌పై గెలిచిన భారత్ నాకౌట్ చేరడంతోపాటు ఫైనల్లో వెస్టిండిస్‌ను ఓడించి వరల్డ్ కప్ టైటిల్ విజేతగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే ఆటగాడు కెవిన్ కర్రన్ మూడు వికెట్లు తీయడంతోపాటు 73 పరుగులు చేశాడు. కెవిన్ అదే వరల్డ్ కప్‌లో అంతకు ముందే ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌తోనే వన్డేల్లోకి అరంగేట్రం చేశాడు.
భారత్‌తో జరిగిన మ్యాచ్ అతడికి మూడోది. కెవిన్ పోరాడినప్పటికీ... కపిల్ దేవ్ రాణించడంతో భారత్ గెలిచింది. అప్పుడు తండ్రి సాధించలేక పోయిన విజయాన్ని 20 ఏళ్ల వయసులో కుమారుడు సాధించాడు. జింబాబ్వే క్రికెట్‌కు విశేష సేవలు అందించిన కెవిన్ 2012లో జాగింగ్ చేస్తూ కుప్పకూలి ప్రాణాలు వదిలాడు. అప్పటికి శామ్ కర్రన్ వయసు 12 ఏళ్లే కావడం విశేషం.