ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 8వ ఎడిషన్‌లో ఛాంపియన్‌గా అవతరించడం పట్ల ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ సంతోషం వ్యక్తం చేశాడు. ఈ సీజన్‌లో తమ ప్రయాణం సాఫీగా సాగిందని, ఐపీఎల్ విజేతగా నిలిచిన తన జట్టును ఇంకేమీ అడగనని అన్నాడు.
మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ 'ఇదో గొప్ప ప్రయాణం. దీనికి మించి ఇంకేమీ అడగను. టైటిల్ పోరులో మా ఆటగాళ్లు బాగా ఆడారు. మరిచిపోలేని విజయం అందించారు' అని అన్నాడు. ఐపీఎల్ లీగ్ దశలో వరుస ఓటముల నుంచి జట్టు పుంజుకున్న తీరు అనూహ్యమని పేర్కొన్నాడు.

ఆదివారం నాడు కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఐపీఎల్ పైనల్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై 41 పరుగుల తేడాతో విజయం సాధించి ఐపీఎల్ ఛాంపియన్‌గా ముంబై అవతరించిన సంగతి తెలిసిందే. ఫైనల్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ (50), సిమన్స్ (68) సాధించిన పరుగులు ముంబై విజయంలో కీలక పాత్ర పోషించాయి.
ఈ మ్యాచ్ లో 26 బంతుల్లో 50 పరుగులు చేసిన రోహిత్ శర్మ 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అందుకున్న విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన మంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 202 పరుగులు సాధించింది. ఆ తర్వాత భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ధోని నేతృత్వంలోని చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లకు గాను 8 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసి, ఓటమి పాలైంది.