
హైదరాబాద్/అమరావతి: గుంటూరు జిల్లాకు చెందిన యువ క్రికెటర్ అంబటి రాయుడు తన కేరీర్‌కు అర్ధాంతరంగా ముగింపు పలికాడు. సెలెక్షన్ కమిటీ వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయన బుధవారం ఉదయం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు తెలిపాడు. టెస్టులు, వన్డే, టీ20.. ఇలా అన్ని ఫార్మట్ల క్రికెట్ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించాడు.
ఈ మేరకు బీసీసీఐ గవర్నింగ్ విభాగానికి ఆయన ఇమెయిల్ చేశారు. ఈ ఉదయం 8:53 నిమిషాలకు ఈ ఇమెయిల్‌ను ఆయన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి అమితాబ్ చౌదరికి పంపించారు. దీన్ని బీసీసీఐ జనరల్ మేనేజర్ సాబాకరీం, రాహుల్ జోహ్రీలకు కాపీ పెట్టాడు.
వారందరికీ థ్యాంక్స్
తన కేరీర్‌లో తాను ఉన్నత స్థితికి చేరుకోవడానికి సహకరించిన వారందరికీ ఈ ఇమెయిల్ ద్వారా అంబటి రాయుడు కృతజ్ఞతలు తెలిపాడు. నేను అన్ని ఫార్మట్ల క్రికెట్ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాను.. అంటూ రాయుడు తన ఇమెయిల్‌ను ఆరంభించారు. తాను అంతర్జాతీయ క్రికెట్ ఆడటానికి అవకాశం కల్పించిన బీసీసీఐకి కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నాడు. తన కేరీర్ ఆరంభానికి సహకరించిన రాష్ట్రస్థాయి క్రికెట్ అసోసియేషన్లను కృతజ్ఞుడినై ఉంటానని పేర్కొన్నాడు. హైదరాబాద్, బరోడా, ఆంధ్ర, విదర్భలకు తాను ప్రాతినిథ్యం వహించానని వివరించాడు.
ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్‌కింగ్స్ ఫ్రాంఛైజీలు తనకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లలో చోటు కల్పించాయని గుర్తు చేశాడు. మహేంద్ర సింగ్ ధోనీ, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల కేప్టెన్సీలో తాను జాతీయ జట్టుకు ఆడానని, ఈ సందర్భంగా వారందరూ తనను ప్రోత్సహించారని చెప్పాడు. ప్రత్యేకించి విరాట్ కోహ్లీ.. తనపై అచంచల విశ్వాసాన్ని ఉంచేవాడని అన్నాడు.
జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించడం తన జీవితంలో మరపురాని మధుర స్మృతులను అందించిందని చెప్పాడు. తన క్రికెట్ ప్రస్థానానికి సహకరించిన తన కుటుంబ సభ్యులు, సన్నిహితులు, ఆప్తమిత్రులు, బంధువులకు కృతజ్ఞతలు చెబుతున్నానని పేర్కొన్నాడు.