
హైదరాబాద్: తిరిగి భారత జట్టులో చోటు దక్కించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని టీమిండియా వెటరన్ క్రికెటర్ సురేశ్ రైనా అన్నాడు. సుదీర్ఘ విరామం తర్వాత సఫారీ పర్యటనలో భాగంగా మూడు టీ20ల సిరిస్‌కు ఎంపిక చేసిన జట్టులో సురేశ్ రైనా చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే.
జోహెన్స్‌బర్గ్ వేదికగా ఆదివారం జరిగిన తొలి టీ20లో ఆడిన రైనా 15 పరుగులు సాధించాడు. మ్యాచ్ అనంతరం బీసీసీఐ టీవీకి ఇంటర్యూలో రైనా మాట్లాడుతూ 'తిరిగి జట్టులో చోటు దక్కించుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. తొలిసారి టీమిండియా జెర్సీ ధరించినప్పుడు ఎలా ఫీలవుతామో.. ఇప్పుడు అదే అనుభూతిని పొందాను' అని తెలిపాడు.
'ఆ సంతోషాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నా. గత ఎనిమిది నెలలుగా దేశవాళీ క్రికెట్లో అన్ని మ్యాచ్‌ల్లో ఆడాను. ఫిట్‌నెస్ సాధించి యో-యో టెస్టులో కూడా పాసయ్యాను. మరోసారి దేశానికి ప్రాతినిధ్యం వహించడం చాలా ఆనందంగా ఉంది. సఫారీ గడ్డపై తొలిసారి వన్డే సిరీస్ సొంతం చేసుకున్న టీమిండియాకు శుభాకాంక్షలు' అని రైనా అన్నాడు.
'వన్డే సిరీస్ విజయంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్, యజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్‌లు కీలకపాత్ర పోషించారు. డ్రెస్సింగ్ రూమ్‌లో భారత ఆటగాళ్లు క్రీడా స్ఫూర్తితో మెలుగుతున్నారు. ఒకరి పట్ల మరొకరు ఎంతో మర్యాద పూర్వకంగా ఉన్నారు' అని అన్నాడు.
'ముఖ్యంగా ఏదైనా మ్యాచ్‌లో ఎవరైనా ఆటగాడు రాణించకపోయినా ఏమాత్రం నిరాశ చెందడం లేదు. మిగతా ఆటగాళ్లు జట్టు విజయంలో కీలకపాత్ర పోషిస్తే వారితో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. ఎప్పుడూ డ్రెస్సింగ్ రూమ్‌లో ఇలాంటి పరిస్థితులే ఉండాలి. అప్పుడే జట్టు రాణించగలదు' అని రైనా తెలిపాడు.
బీసీసీఐ టీవీకి సురేశ్ రైనా ఇచ్చిన ఇంటర్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి