బెంగళూరు: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్ రెండో రోజు.. స్టీవ్ స్మిత్ ఏకాగ్రతను దెబ్బతీసేందుకు భారత బౌలర్ ఇషాంత్ శర్మ చేసిన ప్రయత్నం ట్విట్టర్‌లో హల్‌చల్ చేస్తోంది.
స్టీవ్ స్మిత్ ఓపికగా, మన బౌలర్లకు విసుగు తెప్పించేలా ఆడుతున్నాడు. అతని ఏకాగ్రతను దెబ్బతీయడానికి ఇషాంత్ పదే పదే ప్రయత్నించాడు. ప్రతి బంతికీ అతనివైపు గుర్రుగా చూస్తూ.. స్మిత్ ను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు.

అందులో భాగంగానే ఇలా వింతగా మొహం పెట్టి స్మిత్‌ను అనుకరించాడు. ఇది స్మిత్‌కు ఆగ్రహం తెప్పించిందో లేక మరేమో కానీ.. అతను కూడా ఓ సందర్భంలో అలాగే చేశాడు. ఓ సమయంలో తేలిగ్గా తీసుకొని నవ్వేశాడు కూడా. వెనకాలే ఉన్న కెప్టెన్ కోహ్లి కూడా ఇషాంత్‌ను చూసి నవ్వుకున్నాడు.
ఇటు ఇషాంత్, అటు స్టీవ్ స్మిత్‌లు ఇరువురు ఒకరిని మరొకరు అనుకరిస్తూ ముఖం పెట్టారు. ఈ సంఘటన మార్నింగ్ సెషన్‌లో చోటు చేసుకుంది. స్మిత్‌తో పాటు మరో బ్యాట్సుమెన్ రేన్షాను కూడా ఇషాంత్ టార్గెట్ చేశాడు. ఇప్పుడీ ఫొటో నెట్‌లో వైరల్ అయింది.

దీనిపై మీ కామెంట్ చెప్పండంటూ కొందరు ఈ ఫొటో షేర్ చేస్తున్నారు. క్రికెట్ ఆస్ట్రేలియా వెబ్ సైట్ కూడా ఈ ఫొటోను తమ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. దీనిపై పెద్ద ఎత్తున కామెంట్లు వస్తున్నాయి. పుణే టెస్టులో స్మిత్‌ను జడెజా అనుకరించే ప్రయత్నం చేశాడు.