Ishant Sharma: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో భాగంగా ఆదివారం రాత్రి ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ జట్టు ఆల్ రౌండ్ షోతో అదరగొట్టి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. కానీ ఆ జట్టు బౌలర్ ఇషాంత్ శర్మకు బీసీసీఐ బిగ్ షాక్ ఇచ్చింది. రిఫరీ నిర్ణయంపై ఇషాంత్ అసహనం వ్యక్తం చేయడంతో బీసీసీఐ సీరియస్ అయింది. ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను ఇషాంత్ శర్మ ఉల్లంఘించినట్లు బీసీసీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇషాంత్ శర్మ మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధిస్తూ జరిమానా వేశారు. ఓ డీమెరిట్ పాయింట్ కూడా ఇషాంత్ ఖాతాలోకి వెళ్లింది. దీనిపై ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ఓ స్టేట్మెంట్ రిలీజ్ చేసింది.
గుజరాత్ టైటాన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ లో ఇషాంత్ ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్లోని ఆర్టికల్ 2.2 ప్రకారం లెవెల్ 1 నేరానికి పాల్పడ్డాడని మ్యాచ్ రిఫరీ ప్రకటించాడు. ఈ నిబంధన ప్రకారం.. క్రికెట్ సామాగ్రిని కానీ, దుస్తుల్ని కానీ, మైదానంలోని పరికరాల పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తే ఆర్టికల్ 2.2 కింద జరిమానా విధిస్తారు. అయితే లెవెల్ 1 నేరాన్ని ఇషాంత్ శర్మ అంగీకరించాడు. మ్యాచ్ రిఫరీ జవగల్ శ్రీనాథ్ విధించిన జరిమానాను ఆమోదించాడు.

సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్ లో ఇషాంత్ శర్మకు అంతగా కలిసి రాలేదు. ఇషాంత్ 4 ఓవర్లలో 53 పరుగులు ఇచ్చేశాడు. ఇషాంత్ శర్మ ఇచ్చిన పరుగులు సన్ రైజర్స్ జట్టు స్కోరులో 30 శాతం కావడం గమనార్హం. గుజరాత్ పేసర్లు సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ అద్భుతంగా రాణిస్తున్నా.. ఇషాంత్ చెత్త బౌలింగ్ తో విసుగు తెప్పిస్తున్నాడు. ఇదిలా ఉండగా.. ఈ సీజన్ లో ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్స్ ఉల్లంఘనకు పాల్పడిన ఐదో ఆటగాడు ఇషాంత్ శర్మ. ఇషాంత్ కంటే ముందే హార్ధిక్ పాండ్యా, రియాన్ పరాగ్, రిషబ్ పంత్, దిగ్వేష్ రాఠి ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘనకు పాల్పడ్డారు. వీరిలో కెప్టెన్లు స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానాను ఎదుర్కొనగా.. దిగ్వేష్ రాఠి తన నోట్ బుక్ సెలబ్రేషన్స్ కారణంగా ఫైన్ ఎదుర్కొన్నాడు. పేసర్ ఇషాంత్ శర్మను గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ మెగా వేలంలో రూ.75 లక్షలకు కొనుగోలు చేసింది.