మానసిక అలసట కారణంగా క్రికెట్‌కు దూరమైన ఇషాన్ కిషన్ తిరిగి బరిలోకి దిగనున్నాడని తెలుస్తోంది. ముంబయిలో జరగనున్న డీవై పటేల్ టోర్నమెంట్‌లో ఇషాన్ పాల్గొనున్నట్లు సమాచారం. బీసీసీఐ ఆదేశాల మేరకు అతడు రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
సెంట్రల్ కాంట్రాక్ట్ పొందిన ఆటగాళ్లకు బీసీసీఐ కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశవాళీ టోర్నీలో ఆటగాళ్లందరూ తప్పక పాల్గొనాలని తెలిపింది. ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతూ ఎన్‌సీఏలో రిహాబిలిటేషన్ తీసుకుంటున్న వారికి మాత్రమే మినహాయింపు ఇచ్చింది. మిగతా ఆటగాళ్లంతా తప్పనిసరిగా ఆడాలని సూచించింది.ఈ నేపథ్యంలో ఇషాన్ కిషన్ డీవై పటేల్ టోర్నీలో పాల్గొనున్నాడని తెలుస్తోంది.

దక్షిణాఫ్రికా పర్యటన మధ్యలో భారత జట్టుకు ఇషాన్ కిషన్ దూరమైన విషయం తెలిసిందే. మానసిక అలసట కారణంగా విరామం తీసుకున్నాడు. అయితే అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్, ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌కు ఇషాన్ కిషన్ ఎంపికఅవ్వలేదు. దీనిపై టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ వివరణ కూడా ఇచ్చాడు. మానసిక సమస్యల కారణంగా దూరమైన ఇషాన్ తిరిగి జట్టులోకి రావాలంటే పోటీ క్రికెట్‌ను ఆడి రావాలని సూచించాడు.
దీంతో రంజీ ట్రోఫీలో జార్ఖండ్ తరఫున ఇషాన్ కిషన్ బరిలోకి దిగుతాడని భావించారంతా. కానీ ఇషాన్ రంజీలో ఆడటానికి ఆసక్తి చూపలేదు. పాండ్య బ్రదర్స్ హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్యలతో కలిసి కిరణ్ మోరె క్రికెట్ అకాడమీలో ఇషాన్ శిక్షణ పొందాడు. ఈ విషయంపై మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ పరోక్షంగా విమర్శించాడు. ప్రాక్టీస్ చేస్తారు కానీ, రంజీ ట్రోఫీలో ఆడటానికి ఎందుకు సిద్ధంగా ఉండరని అసహనం వ్యక్తం చేశాడు.
కాగా, ప్రస్తుతం ఇషాన్ కిషన్ బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులో 'గ్రేడ్-సీ'లో ఉన్నాడు. ఏడాదికి రూ.కోటి వేతనం అందుకుంటున్నాడు. మరోవైపు ఇషాన్ కిషన్ జట్టుకు దూరమవ్వడంతో ఇంగ్లండ్ టెస్టు సిరీస్‌కు కేఎస్ భరత్, ధ్రువ్ జురెల్ చోటు దక్కించుకున్నారు. తుదిజట్టులో అవకాశాలు అందుకుంటున్న భరత్ పరుగుల పరంగా నిరాశపరుస్తున్నాడు.