సీఎస్కే ఫ్యాన్స్‌కు దిమ్మతిరిగేలా ఇషాన్ కిషన్ పోస్ట్.. అందులో ఇంత అర్థం ఉందా?
ఐపీఎల్ 2026 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్ కు దూసుకెళ్లడంతో జట్టు వైస్ కెప్టెన్ ఇషాన్ కిషన్ సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. సీఎస్కే హోం గ్రౌండ్ చెపాక్ వేదికగా జరిగిన ఉత్కంఠభరిత పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఎస్ఆర్‌హెచ్ ఈ సీజన్లో ప్లేఆఫ్స్ బెర్తును ఖరారు చేసుకుంది. ఈ కీలక మ్యాచ్‌లో బ్యాట్‌తో చెలరేగి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ఇషాన్ కిషన్.. మ్యాచ్ అనంతరం సీఎస్కే జట్టును ఉద్దేశించి ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్ క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఇషాన్ కిషన్ వీరవిహారం
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత ఓవర్లలో 180 పరుగుల భారీ లక్ష్యాన్ని హైదరాబాద్ ముందు ఉంచింది. చెపాక్ పిచ్ సాధారణంగా స్పిన్నర్లకు అనుకూలిస్తూ, బ్యాటింగ్‌కు కాస్త నష్టంగా ఉంటుంది. అలాంటి పిచ్‌పై 181 పరుగుల ఛేదనతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఓపెనర్, జట్టు వైస్ కెప్టెన్ ఇషాన్ కిషన్ అదిరిపోయే ఆరంభాన్నిచ్చాడు. సీఎస్కే బౌలర్లను ముప్పుతిప్పలు పెడుతూ కేవలం 47 బంతుల్లోనే 70 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఇషాన్ కిషన్ విధ్వంసం నేపథ్యంలో ఎస్ఆర్‌హెచ్ జట్టు మరో ఓవర్ మిగిలి ఉండగానే.. 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మిడిలార్డర్‌లో హెన్రిచ్ క్లాసెన్ కూడా కేవలం 26 బంతుల్లోనే 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 47 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

సోషల్ మీడియాలో ఇషాన్ కిషన్ 12 పదాల సెటైర్ వైరల్
సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించి ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లిన ఆనందంలో ఇషాన్ కిషన్ మ్యాచ్ అనంతరం ఇన్ స్టాగ్రామ్‌లో చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. సీఎస్కే జట్టు అధికారిక స్లోగన్ 'విజిల్ పోడు' (ఈల వేయండి) అన్న సంగతి తెలిసిందే. దీనిని టార్గెట్ చేస్తూ ఇషాన్ కిషన్.. "ఒక్కటే విషయం ఈ విజిల్స్ కంటే గట్టిగా వినిపించింది, అది మా బ్యాట్. ప్లేఆఫ్స్‌లోకి అడుగుపెట్టాం" (One thing louder than the whistles was the bat. Into the playoffs) అంటూ కేవలం 12 పదాలతో ఓ పవర్‌ఫుల్ క్యాప్షన్ పెట్టాడు. సీఎస్కే ఫ్యాన్స్ గుండెల్లో గుచ్చుకునేలా ఉన్న ఈ పోస్ట్ సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవ్వగా.. హైదరాబాద్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
స్టేడియంలోనూ సీఎస్కే ఫ్యాన్స్‌ను కవ్వించిన ఇషాన్ కిషన్
ఇషాన్ కిషన్ కేవలం సోషల్ మీడియా పోస్ట్‌కే పరిమితం కాకుండా.. మ్యాచ్ జరుగుతున్న సమయంలో స్టేడియంలోనూ సీఎస్కే అభిమానులను కాస్త కవ్వించాడు. హైదరాబాద్ విజయం ఖాయమయ్యాక స్టేడియంలోని సీఎస్కే ప్రేక్షకులను చూస్తూ తానూ విజిల్స్ వేస్తున్నట్లు సైగలు చేశాడు. అంతేకాకుండా, ఇక మ్యాచ్ అయిపోయింది కాబట్టి మీ లగేజ్ సర్దుకుని ఇళ్లకు వెళ్లిపోవచ్చనేలా చేతులతో సైగ చేశాడు. సీఎస్కే ఫ్యాన్స్ తమ హోం గ్రౌండ్‌లో విపరీతంగా ఈలలు వేస్తూ ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి తెస్తుంటారు.. దానికి కౌంటర్‌గానే ఇషాన్ కిషన్ ఈ విధంగా ప్రవర్తించినట్లు స్పష్టమవుతోంది. అయితే ఈ ప్రవర్తనపై సీఎస్కే ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
శుభ్‌మన్ గిల్ బాటలోనే ఇషాన్ కిషన్!
ఐపీఎల్‌లో సీఎస్కే ఫ్యాన్స్‌ను, వారి విజిల్ పోడు సంస్కృతిని ప్రత్యర్థి ఆటగాళ్లు టార్గెట్ చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కూడా సీఎస్కేపై విజయం సాధించిన తర్వాత నోట్లో వేలు పెట్టి విజిల్ వేస్తున్నట్లు ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసి హల్చల్ చేశాడు. ఇప్పుడు ఇషాన్ కిషన్ కూడా అదే బాటలో పయనిస్తూ సీఎస్కేపై గట్టిగానే సెటైర్ వేశాడు. ఈ గెలుపుతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆడిన 13 మ్యాచ్‌లలో 8 విజయాలతో మొత్తం 16 పాయింట్లు సాధించి ప్లేఆఫ్స్ టికెట్ సొంతం చేసుకోగా.. చెన్నై గుండెల్లో మాత్రం ఇషాన్ కిషన్ వ్యాఖ్యలు మంటలు రేపుతున్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications