
ఇషాన్ కిషన్.. ప్రస్తుతం టీమిండియాలో చోటు కోసం రేసులో ఉన్న యువ వికెట్ కీపర్ బ్యాటర్. బంగ్లాదేశ్‌తో మూడో టెస్టులో అత్యద్భుతంగా ఆడి, వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగంగా 200 పరుగుల మైలురాయిని చేరుకున్న ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అయితే ఆ తర్వాత టెస్టు సిరీస్‌లో లేకపోవడంతో స్వదేశానికి వచ్చేశాడు. దేశవాళీల్లో జార్ఖండ్ తరఫున ఆడుతున్న అతను.. ఇక్కడ కూడా సత్తా చాటుతున్నాడు. మరి ఇంత అద్భుతంగా ఆడే ఆటగాడికి ఫ్యాన్స్ ఎందుకు ఉండరు చెప్పండి?
అలాంటి ఒక ఫ్యాన్ వెళ్లి కిషన్‌ను కలిశాడు. ఈ స్టార్ బ్యాటర్ కూడా అభిమానిని కలిసినందుకు చాలా సంతోషించాడు. అయితే ఆ ఫ్యాన్ తన మొబైల్ ఇచ్చి దాని వెనుక ఆటోగ్రాఫ్ ఇవ్వాలని అడగడంతో ఇషాన్ కిషన్ షాకయ్యాడు. ఫ్యాన్ అడిగినట్లు ఆటోగ్రాఫ్ చెయ్యలేనని కరాఖండీగా చెప్పేశాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన వాళ్లంతా కిషన్ చేసిన పనిని మెచ్చుకుంటున్నారు. ఆ అభిమానికి సరైన సమాధానం ఇచ్చావని కొనియాడుతున్నారు.
అసలేం జరిగిందంటే.. సదరు అభిమాని మొబైల్‌పై అంతకుముందే ఎంఎస్ ధోనీ చేసిన ఆటోగ్రాఫ్ ఉంది. ఇప్పుడు కిషన్‌ను ఆ సంతకం పైభాగంలో ఆటోగ్రాఫ్ చెయ్యాలని ఆ ఫ్యాన్ అడిగాడు. దీనికి ససేమిరా అన్న కిషన్.. 'అది మహీ భాయ్ సంతకం. మధ్యలో నేను ఎక్కడి నుంచి వచ్చాను? ఆయన సంతకం పైన ఆటోగ్రాఫ్ చేసే స్థాయికి నేను ఇంకా చేరుకోలేదు. కావాలంటే మహీ భాయ్ ఆటోగ్రాఫ్ కింద సైన్ చేస్తా' అని ఒకింత కఠినంగా చెప్పాడు. ఆ తర్వాత ధోనీ సంతకం కిందనే తను కూడా ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. కిషన్, ధోనీ ఇద్దరూ జార్ఖండ్‌కు చెందిన వారే కావడం గమనార్హం. చాలా సందర్భాల్లో తనకు ధోనీ అంటే ఎంత అభిమానమో కిషన్ వెల్లడించాడు కూడా.