మానసిక ఒత్తిడి కారణంగా జట్టు నుంచి దూరమైన టీమిండియా యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ చిక్కుల్లో పడ్డాడు. వన్డే ప్రపంచకప్ అనంతరం విశ్రాంతి కావాలని బీసీసీఐని కోరిన ఇషాన్‌కు దక్షిణాఫ్రికా పర్యటనలో అనుమతి లభించింది. అయితే సౌతాఫ్రికా నుంచి వచ్చిన ఇషాన్ దుబాయ్ పార్టీలో కనిపించడం చర్చనీయాంశంగా మారింది. అంతేగాక బీసీసీఐ అనుమతి లేకుండా 'కౌన్ బనేగా కరోడ్‌పతి' టీవీ షోలో పాల్గొనడటంతో బోర్డు ఆగ్రహం వ్యక్తం చేసిందని వార్తలు చక్కర్లు కొట్టాయి.
ఈ కారణాలతోనే అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్‌కు ఇషాన్ కిషన్‌ను ఎంపిక చేయలేదని కథనాలు వచ్చాయి. అయితే అఫ్గాన్ సిరీస్ ప్రారంభానికి ముందు నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఇషాన్‌పై వస్తున్న వార్తల్ని టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ కొట్టిపారేశాడు. ఇషాన్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదని తెలిపాడు. అయితే మానసిక ఒత్తిడి కారణంగా దూరమైన ఇషాన్ దేశవాళీ క్రికెట్‌లో సత్తాచాటి టీమిండియాలోకి రావాల్సి ఉంటుందని ద్రవిడ్ స్పష్టం చేశాడు. అందుకే అఫ్గానిస్థాన్ సిరీస్‌కు ఎంపిక చేయలేదని తెలిపాడు.

దీంతో ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీలో ఇషాన్ తన జట్టు జార్ఖండ్ తరపున ఆడి తిరిగి టీమిండియాలోకి వస్తాడని భావించారంతా. కానీ ఇషాన్ కిషన్ ఇప్పటివరకు తమ బోర్డుతోనే సంప్రదించలేదని జార్ఖండ్ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ తెలిపింది. ''ఇషాన్ అందుబాటులో ఉంటాడని మాకేం చెప్పలేదు. కానీ అతడు అందుబాటులో ఉంటాడని తెలియజేస్తే తుదిజట్టులో చోటు కల్పిస్తాం'' అని జార్ఖండ్ క్రికెట్ బోర్డు కార్యదర్శి చక్రవర్తి చెప్పాడు.
మరోవైపు ఆదేశాల ప్రకారం ఇషాన్ దేశవాళీ క్రికెట్ ఆడి టీమిండియాకి తిరిగి వస్తాడని భావించిన బీసీసీఐ.. ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ కోసం అతడి పేరు కూడా పరిశీలనలో చేర్చింది. కేఎల్ రాహుల్‌ను స్పెషలిస్ట్ బ్యాటర్‌గానే పరిగణించాలని ఆలోచిస్తుంది. దీంతో వికెట్ కీపర్‌గా ఇషాన్ కిషన్, కేఎస్ భరత్ పేర్లను పరిశీలిస్తుంది. కానీ ఇషాన్ భిన్నంగా ఆలోచిస్తూ కెరీర్‌ను ప్రమాదంలోకి నెట్టుకుంటున్నాడు. ఇటీవల ఇషాన్ ముంబయి ఇండియన్స్ కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యతో కలిసి వడోదరలో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడని వార్తలు వచ్చాయి.