ఇంగ్లాండ్ జట్టు కోసం సిద్ధం చేసే స్పిన్ ఉచ్చులో మనమే పడకుండా జాగ్రత్తగా బ్యాటింగ్ చేయాలని టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సూచించాడు. ఉప్పల్ వేదికగా జరిగిన తొలి టెస్టులో 28 పరుగుల తేడాతో రోహిత్ సేన ఓటమిపాలైన విషయం తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో 190 పరుగుల ఆధిక్యం సాధించి కూడా టీమిండియా పరాజయాన్ని చవిచూసింది. అరంగేట్ర స్పిన్నర్ టామ్ హర్ట్‌లీ బౌలింగ్‌ను ఎదుర్కోలేక రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 202 పరుగులకు ఆలౌటైంది.
అయితే విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా జట్టుకు దూరమవ్వడంతో భారత్ బ్యాటింగ్ విభాగం బలహీనంగా కనిపిస్తోందని హర్భజన్ అన్నాడు. ''బీసీసీఐ రెండో టెస్టుకు జట్టను ప్రకటించింది. గాయాలతో రాహుల్, జడేజా దూరమయ్యారు. తిరిగి ఎప్పుడూ అందుబాటులోకి వస్తారనే విషయంపై స్పష్టత లేదు. విరాట్ కోహ్లి కూడా జట్టులో లేడు. కోహ్లి జట్టులో ఉంటే బ్యాటింగ్ పటిష్టంగా ఉండేది. మరోవైపు శుభ్‌మన్ గిల్ ఫామ్‌లో లేడు. శ్రేయస్ అయ్యర్ పరుగులు సాధించడంలో ఇబ్బందిపడుతున్నాడు. ఇద్దరూ క్లాస్ క్రికెటర్లే, కానీ విఫలమవుతున్నారు''

''ప్రస్తుత టీమిండియా అనుభవం లేని జట్టుగా ఉంది. గత సెకండ్ ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ తర్వాత అత్యధిక పరుగులు సాధించింది అశ్విన్ మాత్రమే. దీన్ని బట్టి చూస్తే బ్యాటింగ్ లైనప్ ఎంతో బలహీనంగా ఉందని తెలుస్తోంది. టర్నింగ్ పిచ్‌లపై ఆడాల్సి వస్తే అశ్విన్ పటేల్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్‌తో పాటు వాషింగ్టన్ సుందర్ తుది జట్టులోకి వస్తారని భావిస్తున్నా. అయితే ఇంగ్లాండ్ కోసం సిద్ధం చేసే స్పిన్ ఉచ్చులో మనమే పడకుండా జాగ్రత్తగా ఆడాలి''
'' అయితే ప్రస్తుత బ్యాటర్లు అందరూ యువకులే. వారికి కాస్త సమయం కావాలి. మంచి ట్రాక్ అయితే పరుగులు సాధిస్తారు. మరోవైపు ఎట్టకేలకు అవకాశం దక్కించుకున్న సర్ఫరాజ్ పరుగులు సాధించాలి. ఛాన్స్‌ను సద్వినియోగం చేసుకోవాలి. అలా చేయలేకపోతే విరాట్ కోహ్లి తిరిగొచ్చిన తర్వాత అతడు చోటు కోల్పోయే ప్రమాదం ఉంది'' అని హర్భజన్ అన్నాడు. జడేజా, రాహుల్ స్థానంలో వాషింగ్టన్ సుందర్, సర్ఫరాజ్ ఖాన్, సౌరభ్ కుమార్ జట్టులో చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. కాగా, ఫిబ్రవరి 2 నుంచి విశాఖ వేదికగా రెండో టెస్టు ప్రారంభం కానుంది.