
హైదరాబాద్: వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్‌కప్ లక్ష్యంగా.. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో గాడితప్పిన మిడిల్ ఆర్డర్‌ను చక్కదిద్దేందు గాను వెస్టిండిస్ పర్యటనకు సెలక్టర్లు జట్టుని ఎంపిక చేశారు. బ్యాటింగ్‌లో మనీశ్ పాండే, శ్రేయస్ అయ్యర్‌ను తీసుకోవడంతో పాటు బౌలింగ్‌లో నవదీప్ షైనీ, రాహుల్ చహర్, దీపక్ చహర్ వంటి కొత్త వారికి అవకాశమిచ్చారు.
మీకోసం: ప్రో కబడ్డీ 7వ సీజన్ స్పెషల్ సైట్
మిడిలార్డర్‌లో మనీశ్ పాండే, శ్రేయాస్ అయ్యర్‌లకు అవకాశం కల్పించారు. అయితే, విండిస్ పర్యటనలో మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీనే ప్రకటించడంపై అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే ముగిసిన ప్రపంచకప్‌లో ఐదు సెంచరీలు బాదడంతో పాటు ఐపీఎల్‌లో నాలుగు ట్రోఫీలు గెలిచిన రోహిత్ శర్మకు కెప్టెన్సీ ఎందుకు అప్పగించడం లేదంటూ ప్రశ్నిస్తున్నారు.
సారథ్య విషయంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల మధ్య విభేదాలు నెలకొనే ప్రమాధం ఉందని కూడా క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ మధ్య కాలంలో కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా వరుస ఓటములను ఎదుర్కొంటోంది. గతేడాది కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాక్ చేతిలో ఓటమిపాలైన సంగతి తెలిసిందే.
ఇక, ఇటీవలే ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో సైతం లీగ్ దశలో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచినా... సెమీస్‌లో మాత్రం న్యూజిలాండ్ చేతిలో ఓడింది. గెలిచే సత్తా ఉన్నప్పటికీ కెప్టెన్‌గా కోహ్లీ సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాడని కొందరు అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
అంతేకాదు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కెప్టెన్సీలను సైతం పోల్చి చూస్తున్నారు. ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ నాయకత్వంలోని ఆర్సీబీ ఒక్కసారి కూడా విజేతగా నిలవని విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. మరోవైపు కెప్టెన్‌గా రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్‌ని నాలుగు సార్లు విజేగా నిలిపిన సంగతి తెలిసిందే.
విరాట్ కోహ్లీ, రవిశాస్త్రి కలిసి అనవసర ప్రయోగాలతో జట్టు కూర్పును దెబ్బతీస్తున్నారని క్రికెట్ అభిమానులు ఆరోపిస్తున్నారు. విరాట్ కోహ్లీ గొప్ప బ్యాట్స్‌మన్ అయినప్పటికీ... టీమిండియాను విజేతగా నిలబెట్టడంలో విఫలమవుతున్నాడని అభిమానులు అంటున్నారు. దీంతో రోహిత్ శర్మకు కెప్టెన్సీ అప్పగించాలని కోరుతున్నారు.