MS Dhoni: ఐపీఎల్ 2025లో సీఎస్కే మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని 9వ స్థానంలో బ్యాటింగ్‌కు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ధోని చివరి ఓవర్లలో బ్యాటింగ్ కు వస్తుండడంతో ఫ్యాన్స్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్ లో 16 పరుగులు చేసిన అనంతరం సందీప్ శర్మ బౌలింగ్ లో ధోని ఔట్ అయ్యాడు. అంతకు ముందు ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో కూడా ధోని 9వ స్థానంలోనే బ్యాటింగ్ కు వచ్చాడు. ఆ తర్వాత సీఎస్కే ఓటమికి ధోనిపై విమర్శలు కూడా చేశారు. బ్యాటింగ్ ఆర్డర్ కారణంగానే ట్రోలర్లు ధోనిని లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ధోని 9వ స్థానంలో బ్యాటింగ్ చేయడానికి గల కారణాన్ని సీఎస్కే ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ వెల్లడించారు.
ధోని 9వ స్థానంలో రావడానికి కారణం చెప్పిన కోచ్..
రాజస్థాన్ రాయల్స్‌తో ఓటమి తర్వాత సీఎస్కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ మీడియాతో మాట్లాడుతూ.. ధోని 9వ స్థానంలో బ్యాటింగ్ చేయడానికి గల కారణాన్ని వివరించాడు. ధోని మోకాళ్లు బలహీనంగా ఉన్నాయని.. వరుసగా 10 ఓవర్లు బ్యాటింగ్ చేయడం అతనికి కష్టమని ఫ్లెమింగ్ చెప్పారు. అందుకే ధోని బ్యాటింగ్ చేయడానికి రావడం లేదని తెలిపారు. ఎంఎస్ ధోని తన బ్యాటింగ్ ఆర్డర్ ను స్వయంగా నిర్ణయిస్తాడని ఫ్లెమింగ్ చెప్పుకొచ్చాడు. ధోని శరీరం, మోకాలు గతంలో ఉన్నంత ఆరోగ్యంగా లేవన్నాడు. ధోని బాగానే నడుస్తున్నాడు.. కానీ కొన్ని సమస్యలు ఉన్నాయని.. అతను పూర్తి 10 ఓవర్లు బ్యాటింగ్ చేయడానికి సరిపోడని సీఎస్కే కోచ్ స్పష్టం చేశారు. దీని కారణంగానే ధోని పరిస్థితిని బట్టి తాను ఏమి చేయగలడో అంచనా వేస్తాడన్నారు. రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో కూడా ఇలాగే బ్యాటింగ్ కు వచ్చాడని చెప్పుకొచ్చారు. ధోని అవకాశం వచ్చినప్పుడు ఇతర బ్యాటర్లకు అవకాశాలు ఇస్తూనే ఉంటాడని ఫ్లెమింగ్ వెల్లడించారు.

ధోనికి ఇప్పుడు 43 సంవత్సరాలు.. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు చాలా తక్కువ బంతులు ఆడుతున్నాడని తెలిసిందే. 13, 14వ ఓవర్ల తర్వాత బ్యాటింగ్ చేయమని జట్టు అడుగుతుందని.. కానీ ధోని మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా మాత్రమే బ్యాటింగ్ కు వస్తాడని కోచ్ స్టీఫెన్ అన్నారు. గత సంవత్సరం తాను చెప్పినట్లుగా ధోని మాకు చాలా ముఖ్యమైన ఆటగాడు అని కోచ్ తెలిపారు. ధోని ఒక నాయకుడు అని.. వికెట్ కీపింగ్ నుంచి కూడా అతని పాత్ర ముఖ్యమైనదని చెప్పుకొచ్చారు. అలాంటి ఆటగాడిని తాము 9 లేదా పది ఓవర్లు ఆడించాలని తాము అనుకోవడం లేదని.. ధోని ఫిట్ నెస్ సరిపోదని మాకు తెలుసన్నారు. అందుకే 14 ఓవర్ల నుంచైనా బ్యాటింగ్ కు వెళ్లేలా సన్నద్ధం చేస్తున్నామని.. అయితే బ్యాటింగ్ ఆర్డర్ లో ఉన్నవారిని బట్టి నిర్ణయాలు ఉంటాయని సీఎస్కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ స్పష్టం చేశారు.