స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లిని టీ20 వరల్డ్ కప్ నుంచి తప్పించే ఆలోచనలో బీసీసీఐ ఉందని వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఈ వార్తల్లో నిజం ఎంత వరకు ఉందో తెలియనప్పటికీ దీనిపై మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. తాజాగా కోహ్లి వేటుపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ మహ్మద్ మాట్లాడాడు.
ఒంటిచేత్తో మ్యాచ్‌లను గెలిపించే సత్తా ఉన్న కోహ్లిని జట్టు నుంచి ఎలా తప్పిస్తారని ఇర్ఫాన్ మహ్మద్ ప్రశ్నించాడు. ఇటీవల జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో కోహ్లి పారించిన పరుగుల వరదను గుర్తుచేశాడు. కోహ్లి లేకుండా జట్టును ఊహించలేమని పేర్కొన్నాడు. గల్లీ క్రికెట్ స్థాయి వాళ్లకే వరల్డ్ కప్‌లో కోహ్లి ఉండడేమో అనే ఆలోచనలు వస్తాయని అన్నాడు.

''విరాట్ కోహ్లిని తప్పిస్తారని నేను అనుకోవట్లేదు. కోహ్లి లేకుండా జట్టును ఏర్పాటు చేయలేరు. అతను అద్భుతమైన బ్యాటర్. గతేడాది వన్డే వరల్డ్‌కప్‌లో అతని గొప్ప ప్రదర్శనను మనందరం చూశాం. ఆ మెగాటోర్నీలో కోహ్లి ఒక్కడే మూడు నుంచి నాలుగు మ్యాచ్‌లు గెలిపించాడు. గ్రూప్ స్టేజ్‌లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో ఆదిలోనే టీమిండియా వికెట్లు కోల్పోయింది. అప్పుడు కోహ్లినే ఒంటిచేత్తో జట్టుకు విజయాన్ని అందించాడు''
''ఇటీవల కూడా కోహ్లి మ్యాచ్‌లను గెలిపించాడు. కోహ్లి స్థానంపై సందేహాలు తీసుకురావడమంటే అది అన్యాయమే. టీ20 వరల్డ్ కప్‌లో కోహ్లి స్థానం అనుమానమే అని భావించేవాళ్లు గల్లీ క్రికెట్ స్థాయికి చెందినవాళ్లే'' అని ఇర్ఫాన్ మహ్మద్ అన్నాడు. టీ20 క్రికెట్‌లో స్ట్రైక్‌రేట్ కీలకమని ఇర్ఫాన్ అభిప్రాయపడ్డాడు. ఓ బ్యాటర్ పరుగులు సాధించడానికి ఎక్కువ పరుగులు ఎదుర్కొంటే అది జట్టుపై ఒత్తిడి తీసుకువస్తుందని తెలిపాడు. 10 బంతుల్లో 30 పరుగులు సాధించేలా ఆడితే జట్టుపై ఎలాంటి ఒత్తిడి ఉండదని పేర్కొన్నాడు.
టీ20 వరల్డ్ కప్‌కు కోహ్లిని ఎంపిక చేయొద్దని బీసీసీఐ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. వెస్టిండీస్ పిచ్‌లు చాలా స్లోగా ఉంటాయని, అక్కడి పరిస్థితుల్లో యాంకర్ ఇన్నింగ్స్‌లు ఆడే కోహ్లి జట్టుకు భారమవుతాడనే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు కథనాలు వచ్చాయి. కోహ్లిని సున్నితంగా జట్టులో నుంచి తప్పించే బాధ్యతలను టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌కు అప్పగించినట్లు సమాచారం. మెగాటోర్నీ నుంచి స్వచ్ఛందంగా కోహ్లినే తప్పుకునేలా అగార్కర్ ప్రయత్నిస్తునున్నట్లు తెలుస్తోంది.