హైదరాబాద్: చిట్టగాంగ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో తొలి టెస్టులో బంగ్లా చేతిలో ఎదురైన పరాభవానికి ఆస్ట్రేలియా ప్రతీకారం తీర్చుకున్నట్లు అయింది. నాథన్ లియాన్ (6/60) విజృంభించి ఆసీస్ విజయంలో కీలకపాత్ర పోషించాడు.

దీంతో రెండు టెస్టుల సిరీస్ 1-1తో సమమైంది. తొలి టెస్టులో 20 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ సంచలన విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఓవర్‌నైట్ స్కోరు 377/9తో నాలుగో రోజు, గురువారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియా అదే స్కోరు వద్ద ఆలౌటైంది.
తొలి ఇన్నింగ్స్ లో బంగ్లా 305 పరుగులకే ఆలౌట్ కావడంతో ఆసీస్ కు 72 పరుగుల ఆధిక్యం లభించినట్లయింది. బంగ్లాదేశ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 71.2 ఓవర్లలో 157 పరుగులకే ఆలౌటైంది. నాథన్ లియాన్ ధాటికి లంచ్ విరామానికి 83 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ముష్ఫికర్ రహీమ్ (31) టాప్ స్కోరర్ గా నిలిచాడు.
దీంతో ఆస్ట్రేలియా ముందు 86 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. అనంతరం 86 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌కు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 15.3 ఓవర్లలో మూడు వికెట్లకు 87 పరుగులు చేసి నెగ్గింది. ఈ మ్యాచ్‌లో మొత్తం 13 వికెట్లు తీసిన లయన్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌తో పాటు వార్నర్‌తో కలిసి సంయుక్తంగా మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డును కూడా దక్కించుకున్నాడు.