Irfan Pathan: ప్రతిసారి అలాంటి బౌలర్ దొరకడు.. ఉన్నప్పుడే వాడుకోవాలి, ఆడినా ఆడకున్నా జట్టులో ఉంచాలి

దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఉమ్రాన్ మాలిక్ అరంగేట్రం గురించి ఎంతో మంది అభిమానులు ఎదురుచూశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022లో అతను ఆకట్టుకునేలా వేగవంతమైన బౌలింగ్ చేశాడు. కన్సిస్టెన్సీగా 150 కి.మీ వేగంతో అతను బంతులేయడంతో ఇక టీమిండియా టీ20 ప్రపంచకప్ జట్టులో అతన్ని ఎంపిక చేయాలంటూ చాలా మంది సీనియర్ క్రికెటర్లు, విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
ఇక దక్షిణాఫ్రికా సిరీస్లో అతను అరంగేట్రం చేయడం తప్పనిసరి అని భావించిన క్రికెట్ అభిమానులకు నిరాశే ఎదురైంది. ఈ సిరీస్ మొత్తం ఉమ్రాన్ బెంచ్ ప్లేయర్‌గానే కొనసాగాడు. ఇక ఈ సిరీస్లో టీమిండియ ప్లేయింగ్ XIని ఒక్కసారి కూడా మార్చకుండా కెప్టెన్ రిషబ్ పంత్ బరిలోకి దిగాడు. ఈ సిరీస్‌లో ఇదివరకే ఎంపికయిన ప్లేయర్లను తుది జట్టులో ఆడించారు. ఇకపోతే మాజీ భారత ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్.. ఉమ్రాన్ మాలిక్ అరంగేట్రం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఐర్లాండ్ పర్యటనలోనైనా
ఈ నెలాఖరులో ఐర్లాండ్ పర్యటనకు టీమిండియా వెళ్లనుంది. ఐర్లాండ్‌తో భారత్ రెండు టీ20లు ఆడనుంది. ఐర్లాండ్ పర్యటనలోనైనా ఉమ్రాన్ మాలిక్ తుది జట్టులో ఎంపిక అవుతాడో కాడో అనేది సందిగ్ధమే. ఇక టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా జట్టుకు ఉమ్రాన్ ఎంపికయ్యే అవకాశాలున్నాయా అని స్టార్ స్పోర్ట్స్ వ్యాఖ్యాత ఇర్ఫాన్ పఠాన్‌ను అడగ్గా అతను స్పందిస్తూ.. 'ఉమ్రాన్ ఇంకా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు, అతను ఇంకా అరంగేట్రమే చేయలేదు. మొదట అతన్ని డెబ్యూ చేయనియండి. డెబ్యూ చేశాక అతను ఎలా ఆడతాడో చూద్దాం. అతను అరంగేట్రం చేశాక.. అతను ఫెయిల్ అయితే మాత్రం అతన్ని పక్కన పెట్టవద్దు.' అని పఠాన్ పేర్కొన్నాడు.

మనకు 150కి.మీ వేగంతో బౌలింగ్ చేసే బౌలర్లు లేరు
ఇండియాకు 150కి.మీ వేగంతో బౌలింగ్ చేసే బౌలర్ దాదాపు ఎప్పుడూ లేరు, ఇప్పుడు మనకో బౌలర్ ఉన్నాడు. కాబట్టి అతన్ని జాగ్రత్తగా లాంగ్ రన్లో ఇండియా జట్టుతో పాటు కొనసాగించాలి. అతని లాంగ్ రన్ ఏమిటో, అతని ఫిట్‌నెస్ అతనికి ఎంత వరకు ఉపయుక్తమవుతుందో చూడాలి.' అని పఠాన్ అభిప్రాయపడ్డాడు. ఉమ్రాన్ మాలిక్ స్పెషాలిటీ ఏంటంటే అతని రా పేస్. ఎలాగైనా సెలెక్టర్లు, టీమ్ మేనేజ్‌మెంట్ అతన్ని పట్టుదలగా జట్టుతో పాటు ముందుకు తీసుకెళ్లాలని కోరాడు.

స్పీడ్‌గా బౌలింగ్ చేయించడం ఎవరి తరం కాదు
ఇక పఠాన్ మాట్లాడుతూ.. అంత మంచి రా పేస్ మీకు లేదు నాకు లేదు. ఎవరికీ వేగంగా బౌలింగ్ చేయడం మనం నేర్పలేం. అది వారి శక్తి, సహజత్వం మేరకు అబ్బుతుంది. ఇర్ఫాన్ పఠాన్ కానివ్వండి.. ప్రపంచంలోని అత్యుత్తమ మెంటర్ లేదా కోచ్ కానివ్వండి.. వేగవంతమైన బౌలింగ్ నేర్పలేం. కానీ అతని వేగానికి సరైన లయ దొరికి రాణించే మెలకువలను మాత్రం అతనికి నేర్పగలం. ఇకపోతే అతనిని ఎలాగైనా ఇండియా తరఫున అరంగేట్రం చేసేలా చేయండి. అతను ఒక వేళ రాణిస్తే.. జట్టులో కొనసాగనివ్వండి. రాణించకపోతే అతన్ని పట్టుదలగా జట్టుతో పాటు ముందుకు తీసుకెళ్లండి. ఎందుకంటే మనకు అలాంటి బౌలర్ ప్రతిసారీ దొరకడు' అని పఠాన్ అన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications