ఇర్ఫాన్ పఠాన్ మెరుపు ఇన్నింగ్స్.. ఇండియా లెజెండ్స్‌కు రెండో విజయం!!

ముంబై: రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో ఇండియా లెజెండ్స్ జోరు సాగుతోంది. ఓటమి ఖాయం అనుకున్న సమయంలో మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ (57*, 31 బంతుల్లో; 6×4; 3×6) భారీ షాట్లతో చెలరేగడంతో సచిన్ సేన 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ఇండియా లెజెండ్స్ వరుసగా రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. అద్భుతంగా ఆడిన ఇర్ఫాన్‌కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' దక్కింది. రోడ్డు భద్రతపై అవగాహన పెంచేందుకు నిధుల సేకరణ కోసం మహారాష్ట్ర ప్రభుత్వం వరల్డ్ సిరీస్‌ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

దిల్షాన్ మెరుపులు:
మొదట టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక లెజెండ్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. శ్రీలంక లెజెండ్స్‌కు ఓపెనర్లు తిలకరత్నే దిల్షాన్ (23; 23 బంతుల్లో; 4×4), రొమేష్ కలువితరణ (21, 25 బంతుల్లో; 4×4) మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఈ జోడి తొలి వికెట్‌కు 46 పరుగులు జోడించారు. దిల్షాన్‌ను మునాఫ్ పటేల్ ఔట్ చేయగా.. అనంతరం కొద్దిసేపటికే కలువితరణను పఠాన్ పెవిలియన్‌కు చేర్చాడు. దీంతో లంక ఓపెనర్లను కోల్పోయింది.

ఆదుకున్న కపుగెదర:
ఆ తర్వాత వచ్చిన మర్వాన్ ఆటపట్టు (1), తిలన్ తుషారా (10) ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. గోనీ, బంగర్ ఈ ఇద్దరిని ఔట్ చేసారు. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన సచిత్ర సేననాయక (19, 15 బంతుల్లో; 3×4)తో కలిసి చమర కపుగెదర (23, 17 బంతుల్లో; 3×4) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీరిద్దరు మంచి షాట్లతో అలరించారు. ఆపై మహారూఫ్ (10), మెండిస్ (9), హెరాత్ (12) పరుగులు చేయడంతో లంక మోస్తరు స్కోర్ చేసింది. ఇండియా లజెండ్స్ బౌలర్లలో మునాఫ్ పటేల్ (4/19) చెలరేగాడు. జహీర్ ఖాన్, ఇర్ఫాన్ పఠాన్, మన్‌ప్రీత్ గోని, సంజయ్ బంగర్ తలో వికెట్ తీశారు.

కైఫ్ సూపర్ ఇన్నింగ్స్:
లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన ఇండియా లెజెండ్స్‌కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. కెప్టెన్ సచిన్ టెండూల్కర్ పరుగుల ఖాతా తెరవకముందే పెవిలియన్‌కు చేరాడు. కొద్దిసేపటికే వీరేంద్ర సెహ్వాగ్ (3) రనౌట్ అయ్యాడు. ఆపై యువరాజ్ సింగ్ (1) కూడా క్యాచ్ ఔట్ అయ్యాడు. సచిన్, యువరాజ్‌లు చమిందా వాస్ బౌలింగ్‌లో ఔటయ్యారు. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన సంజయ్ బంగర్ (18, 19 బంతుల్లో; 2×4)తో కలిసి మహ్మద్ కైఫ్ (46, 45 బంతుల్లో; 4×4,1×6) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. నాలుగో వికెట్‌కు 43 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.

పఠాన్ మెరుపు ఇన్నింగ్స్:
ధాటిగా ఆడే క్రమంలో సంజయ్, కైఫ్ ఔటవ్వడంతో 81 పరుగులకే ఇండియా లెజెండ్స్ ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇక 18 బంతుల్లో 39 పరుగులు చేయాల్సి ఉండగా.. ఇర్ఫాన్ పఠాన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. మహారూఫ్ బౌలింగ్‌లో ఇర్ఫాన్ వరుసగా 6, 6, 4 బాదగా.. ఆఖరి బంతికి గోని (11, 8 బంతుల్లో; 1×6) సిక్సర్ కొట్టడంతో ఈ ఓవర్‌లో మొత్తం 26 పరుగులు వచ్చాయి. అనంతరం దిల్షాన్ బౌలింగ్‌లో ఇర్ఫాన్ హ్యాట్రిక్ ఫోర్లు బాదడంతో ఇండియా లెజెండ్స్ సునాయాస విజయాన్ని అందుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications