
పాక్ భారీ స్కోర్:
2006లో ఫైసలాబాద్ వేదికగా భారత్-పాక్ మధ్య టెస్టు మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 588 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇంజిమామ్ ఉల్ హక్ (119), షాహిద్ అఫ్రిది (156) సెంచరీలు బాదారు. తర్వాత టీమిండియా ఇన్నింగ్స్ ఆరంభించగా.. 281 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ధోనీ క్రీజులో ఉండగా.. సచిన్ టెండూల్కర్ ఔటయ్యాడు. ఇక ఇర్ఫాన్ పఠాన్ ఆరో బ్యాట్స్‌మన్‌గా క్రీజులోకి వచ్చాడు. అప్పుడే అక్తర్‌తో స్లెడ్జింగ్ చేశానని తెలిపాడు ఇర్ఫాన్. తాజాగా పఠాన్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆ విశేషాలను వెల్లడించాడు.

పదేపదే బౌన్సర్లు సంధించాడు:
'నేను బ్యాటింగ్ చేయడానికి వచ్చేసరికి అక్తర్ చాలా వేగంతో బంతులేస్తున్నాడు. ధోనీ వద్దకెళ్లి పిచ్ ఎలా స్పందిస్తుందని అడగ్గా.. పెద్దగా ఏం లేదు, నిదానంగా బ్యాటింగ్ చెయ్ అన్నాడు. ఇక అక్తర్ వేసిన బంతిని ఎదుర్కొన్నా. అది వేగంతో వచ్చిన బౌన్సర్. బంతి కనపడకుండానే వెళ్లిపోయింది. ఆ తర్వాత కూడా పదేపదే బౌన్సర్లు సంధించాడు. ఏదోలా అక్తర్ స్పెల్ పూర్తి చేశాం. ఇక మంచి భాగస్వామ్యం నిర్మించాలనుకున్నాం. అయితే కొద్ది సేపటికే అక్తర్ మళ్లీ బౌలింగ్‌కు వచ్చాడు. బౌన్సర్లు వేస్తూ మమ్మల్ని కవ్వించడానికి ప్రయత్నించాడు' అని పఠాన్ తెలిపాడు.

అక్తర్‌ని రెచ్చగొట్టా:
'నేను అక్తర్‌ను స్లెడ్జింగ్ చేస్తా, అప్పుడు నువ్వు అతడిని చూసి నవ్వేసెయ్ అని చెప్పడంతో ధోనీ ఒప్పుకున్నాడు. అక్తర్ వేసే బంతులు రివర్స్‌స్వింగ్ అవ్వడం మొదలెట్టాయి. అది ఇంకా ప్రమాదకరం. దాంతో అక్తర్ షార్ట్ పిచ్ బంతులేసేలా చూడాలని మేం ప్రణాళిక వేసుకున్నాం. సరిగ్గా అప్పుడే నేను అక్తర్‌ని రెచ్చగొట్టా. "తర్వాతి స్పెల్‌లోనూ నువ్వు ఇంతే తీవ్రతతో బౌలింగ్ చేయగలవా" అని అక్తర్తో అన్నా. వెంటనే కోపోద్రిక్తుడైన అతడు.. "నువ్వు చాలా మాట్లాడుతున్నావ్. నిన్ను ఇక్కడి నుంచి పంపించేస్తా" అన్నాడు. 'అది నీవల్ల కాదు. వెళ్లి బౌలింగ్ చెయ్. నేనూ నిజమైన పఠానే' అని బదులిచ్చా' అని ఇర్ఫాన్ చెప్పాడు.

మ్యాచ్‌ను కాపాడుకున్నాం:
'అక్తర్ మళ్లీ బంతి బౌన్సర్ వేసాడు. నేను ఆ బంతిని ఆడలేదు. తర్వాత షార్ట్ డెలివరీస్ వేయడం మొదలెట్టాడు. అప్పుడు నేను ధోనీతో మాట్లాడటానికి వెళ్లడంతో పక్కనే అక్తర్ కూడా ఉన్నాడు. "పాజీ ఈ పిచ్ చెత్తగా ఉంది. నువ్వింకా తక్కువ ఎత్తులో బంతులేయాల్సిన అవసరం ఉంది" అని కవ్వించా. అప్పుడు కూడా కోపంగానే బంతులేశాడు. దాంతో మేం అక్తర్ స్పెల్‌ను ఎదుర్కోగలిగాం. ఆ తర్వాత మాకు బ్యాటింగ్ చేయడం తేలికగా మారి మంచి స్కోర్ సాధించాం. ఆపై మ్యాచ్‌ను కాపాడుకున్నాం' అని ఇర్ఫాన్ చెప్పుకొచ్చాడు.

మ్యాచ్ డ్రా:
ఫైసలాబాద్ టెస్టులో ధోనీ (143; 153 బంతుల్లో 19x4, 4x6), ఇర్ఫాన్ (90; 170 బంతుల్లో 9x4, 2x6) ఆరో వికెట్‌కు 210 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఇది ధోనీకి టెస్టుల్లో తొలి శతకం. చివరికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 603 పరుగులు చేసి ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌లో పాక్.. చివరి రోజు 490/8 వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 21 పరుగులు చేయడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.


Click it and Unblock the Notifications
