
ముంబై: భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్, విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మల మధ్య శుక్రవారం మాటల యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ వివాదం చినికిచినికి గాలివానగా మారుతోంది. సామాజిక మాధ్యమాల్లో దీనిపై పెద్ద దుమారం రేగుతోంది. ఇక గవాస్కర్‌కు మద్దతుగా 'WeSupportGavaskar' అనే హ్యాష్‌ట్యాగ్‌తో ట్వీట్లు చేస్తున్నారు. శనివారం ఉదయం నుంచి గవాస్కర్ అభిమానులు ఈ హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండింగ్ చేయడం గమనార్హం. అంతేకాదు కొందరు మాజీ క్రికెటర్లు కూడా గవాస్కర్‌కు మద్దతుగా నిలిచారు.
టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఈ విషయంపై స్పందించాడు. తన మద్దతు మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్‌కే ఉంటుందని ట్విటర్ ద్వారా తెలిపాడు. 'సునీల్ గవాస్కర్ వయసులో పెద్దవారు. భారత్ క్రికెట్‌కు తన సేవలందించారు. ఆయనను గౌరవించాల్సిన అవసరం ఉంది. ఆయన చేసిన వ్యాఖ్యలు ఎవరో వక్రీకరించి సోషల్ మీడియాలో పెట్టినట్లు స్వయంగా సన్నీ వివరణ ఇచ్చారు. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి. ఆయన వయసును గౌరవించండి' అని పఠాన్ ట్వీట్ చేశాడు.
పంజాబ్, బెంగళూరు మ్యాచ్‌కు సునీల్ గవాస్కర్ వ్యాఖ్యానం చేశారు. అప్పుడే విరాట్ కోహ్లీ బ్యాటింగ్ గురించి ఆయన మాట్లాడారు. 'ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే.. అంత బాగా మెరుగవుతానని కోహ్లీకి తెలుసు. లాక్‌డౌన్ ఉండటంతో అనుష్క బౌలింగ్‌లో మాత్రమే కోహ్లీ సాధన చేశాడు. అలా చేయడం అతనికి ఉపయోగపడలేదని తెలుస్తోంది' అని ఆయన అన్నారు. గవాస్కర్ వ్యాఖ్యలపై కోహ్లీ సతీమణి ఫైర్ అయ్యారు.

'మిస్టర్ గవాస్కర్.. మీ వ్యాఖ్య అసహ్యకరంగా ఉంది. భర్త ఆట గురించి భార్యపై నిందలు వేస్తూ అభ్యంతరకరంగా ఎందుకు మాట్లాడారో వివరిస్తే బాగుంటుంది. వ్యాఖ్యానంలో నా పేరును ఉపయోగించడం సందర్భోచితం అనుకున్నారా?. క్రికెట్ విషయాల్లోకి నన్ను లాగడం ఎప్పుడు మానుకుంటారు' అని సన్నీ వ్యాఖ్యలపై అనుష్క ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుష్క విమర్శలపై గవాస్కర్ స్పందించారు.
'అనుష్కను నేనెక్కడ నిందించాను. ఆమెను అస్సలు నిందించలేదు. విరాట్‌కు అనుష్క బౌలింగ్ చేసినట్లు వీడియోలో చూపించారనే చెప్తున్నా. లాక్‌డౌన్ సమయంలో కోహ్లీ ఆ మాత్రం బౌలింగే ఆడాడు. భర్తలతో కలిసి భార్యలు కూడా పర్యటనలకు వెళ్లే అంశపై మొదట్నుంచీ మద్దతుగా మాట్లాడుతోంది నేనే. కోహ్లీకి అనుష్క బౌలింగ్ చేసిందని అన్నా. బౌలింగ్ అని మాత్రమే అన్నా. మహిళలను కించపరిచే విధంగా ఎక్కడ మాట్లాడాను. లాక్‌డౌన్‌లో విరాట్‌తో సహా ఎవరికీ సరైన ప్రాక్టీస్ లేదని చెప్పడమే నా ఉద్దేశం. నా మాటల్ని ఎవరో వక్రీకరిస్తే ఏం చేయగలను' అని అన్నారు.